- మల్రెడ్డిపల్లిలో ఫెన్సింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ప్రమాదం
- విద్యుత్ షాక్‌తో మేక మృతి.. ఆగ్రహంలో గ్రామస్థులు
జనవాహిని ప్రతినిధి తాండూరు; విద్యుత్ శాఖ అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం మూగజీవి ప్రాణాలను బలితీసుకుంది. పట్టణ పరిధిలోని మల్రెడ్డిపల్లి లో రక్షణ కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి ఒక మేక అక్కడికక్కడే మృతి చెందింది.
గ్రామస్థుల కథనం ప్రకారం.. మల్రెడ్డిపల్లి గ్రామంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మూడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు కనీస రక్షణ ఫెన్సింగ్ కూడా లేకపోవడంతో తీవ్ర ప్రమాదకరంగా మారాయి. ఆదివారం రోజున మేత కోసం వెళ్లిన మేక ప్రమాదవశాత్తు ఫెన్సింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల నిత్యం భయంతో కాలం వెళ్లదీస్తున్నామని వాపోయారు. ఈరోజు మూగజీవి బలి అయిందని, రేపు చిన్న పిల్లలు గానీ, బాటసారులు గానీ ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను నిలదీశారు. ప్రభుత్వానికి ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన కంటే రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక లాభాలే ముఖ్యమైపోయాయని మండిపడ్డారు.
అధికారులు వెంటనే స్పందించాలి
ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మల్రెడ్డిపల్లిలోని అన్ని ట్రాన్స్‌ఫార్మర్లకు భద్రతా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అసర్థకర ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
