సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్వీసులో ఉన్న టీచర్లకు సైతం టెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. దీంతో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో షెడ్యూల్ విడుదల చేస్తూ ఓ పోస్టు పెట్టారు. ఇందులో టెట్ పరీక్ష నోటిఫికేషన్, దరఖాస్తులు, పరీక్ష తేదీతో సహా పూర్తి వివరాలు ఉన్నాయి. దీంతో ఇప్పటివరకూ టెట్ పరీక్ష రాయని వారు, రాసినా ఉత్తీర్ణులు కాని ఇన్ సర్వీస్ టీచర్లు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ‘ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (Special TET)ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసారు. అంకితభావంతో పనిచేస్తున్న మన ఉపాధ్యాయులు టెట్ అర్హతను సాధించి, ఆత్మవిశ్వాసంతో తమ వృత్తిపరమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన తెలిపారు. టెట్ పరీక్షకు ఇవాళ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే దరఖాస్తులని రేపటి నుంచి అంటే 25 ఆగస్టు నుంచి 24 సెప్టెంబర్ వరకూ స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 11-21 మధ్య పరీక్షలు ఉంటాయన్నారు.
Special TET for In-Service Teachers
It gives me immense pleasure to announce the Special Teacher Eligibility Test (Special TET) for In-Service Teachers by the Government of Andhra Pradesh.
This is a significant opportunity for our dedicated teachers to fulfil the TET…
అర్హులైన ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, మాక్ టెస్ట్‌ల (mock tests) ద్వారా పరీక్షకు సిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ స్పెషల్ టెట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు, మార్గదర్శకాల కోసం అధికారిక వెబ్ సైట్లు https://cse.ap.gov.in, https://tet2dsc.apcfss.in ను సంప్రదించాలని లోకేష్ సూచించారు. మన ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యకు బలమైన పునాదిని వేయడంలో మనమందరం కలిసి కృషి చేద్దామని లోకేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
