- తాండూరు 10వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి
- వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం,కౌన్సిలర్ శ్రీకాంత్
జనవాహిని ప్రతినిధి తాండూరు: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు భవానీ నగర్‌లో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. స్థానిక నంబర్ వన్ పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డులలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తోందని తెలిపారు. భవాని నగర్ లో చినుకు పడితే మోకాళ్ళ లోతు వరద నీరు రోడ్డుపై నిరుస్తున్నాయని కౌన్సిలర్ పదేపదే ఒత్తిడి చేయడంతో సిసి రోడ్డు పనులు ప్రారంభించినట్టుగా తెలిపారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో భవానీ నగర్ వాసులకు ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. వార్డులో నిలిచిపోయిన డ్రైనేజీ నిర్మాణాలు, ఇతర అంతర్గత రోడ్ల పనులను కూడా త్వరలోనే మంజూరు చేయించి వేగవంతంగా పూర్తి చేస్తామని వార్డు ప్రజలకు భరోసా ఇచ్చారు. 10వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
