పెచ్చుమీరిపోతున్న ఫైనాన్సర్ల వేధింపులు..
ఖమ్మం జిల్లా కేంద్రంలో బైక్ ఫైనాన్సర్ల వేధింపులు నానాటికి హెచ్చరిల్లి పోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ వేధింపులు ఒక యువకుడి ప్రాణాలను సైతం బలి తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో బైక్ లు అమ్ముతున్న ఫైనాన్స్ కంపెనీలు ఒక్క నెల కిస్తీ చెల్లించకపోయినా వాహనదారుడి ఇంటికి వెళ్లి పది మందిలో పరువు తీయడం ద్వారా విపరీతమైన వేధింపులకు, ఒత్తిడికి గురి చేస్తున్నారు. మరికొందరు డబుల్ తాళాలతో వేధిస్తున్నారు. ఒక తాళం తమ వద్ద పెట్టుకొని కిస్తీ కట్టని నెల దౌర్జన్యంగా బైకును లాక్కెళ్ళుతున్నారు. ఫైనాన్స్ కంపెనీ యజమానులు ఇందుకోసం రికవరీ ఏజెంట్లుగా ఆజానుబాహులను నియమించుకుంటున్నారు. కరుడుగట్టిన మనస్తత్వం కలిగిన వ్యక్తులను నియమిస్తుండడంతో వారు అత్యంత వాశవికంగా వ్యవహరిస్తూ వాహనదారులపై అమానవీయంగా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రాజస్థాన్ కు చెందిన వినయ్ ఫైనాన్సర్ల ఉచ్చులో పడి బలైపోయాడు.