posted on Mar 23, 2024 9:48AM
బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో సుమారు 25వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ, నార్కోటిక్స్ అధికారులు గుర్తించారు. ఈనెల 19న నార్కోటిక్స్ సామగ్రి, నిపుణులతో వచ్చిన సీబీఐ అధికారులు ఆ కంటైనర్‌లో భారీ మెత్తంలో డ్రగ్స్ ఉన్నట్టు నిర్ధరించుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారులు వాటిని సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ సంధ్యా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ వైసీపీ నేతదిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీని మేనేజింగ్ డైరెక్టర్ కోనం వీరభద్రరావుగా తెలుస్తోంది. వీరు నలుగురు సోదరులు, వీరిలో ఇద్దరు అమెరికాలో సెటిల్ కాగా.. మరో ఇద్దరు ఇక్కడ ఉంటున్నారు. వీరభద్రరావు, అతని సోదరుడికి వైసీపీతో, ముఖ్యంగా విజయసాయిరెడ్డితో సంబంధాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా సీఎం జగన్, విజయసాయి రెడ్డి, ఇతర వైసీపీ పెద్దల ఫొటోలతో వీరభద్రరావు, అతని సోదరుడు ప్లెక్సీలు సైతం వేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతలతో సంబంధం ఉన్నటువంటి కోనం వీరభద్రరావు కంపెనీకి డ్రగ్స్ ఆర్డర్ వచ్చిందనేది అతిపెద్ద చర్చగా మారింది. దీంతో ఈ డ్రగ్స్ మాఫియా వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించి దీన్ని క్యాష్ రూపంలో మార్చాలని ప్లాన్ గా తెలుస్తోంది. కానీ, కేవలం మేము రొయ్యల మేత కోసమే తెప్పించామని, అందులో కొకైన కలిసి ఉందని మాకు తెలియదని వారు చెబుతున్నప్పటికీ.. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది.. గతంలో వీళ్లకు ఏమైనా సరుకు రవాణా అయిందా అనే విషయాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.
విశాఖ పోర్టుకు ఈనెల 16న చేరిన కంటెయినర్ ను తెరిపించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించే క్రమంలో.. వైసీపీకి చెందిన కొందరు బడా నేతలు ఈ కంటెయినర్ తెరవకుండా అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించటం చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం వారు తమకు వత్తాసుగా కొందరు ప్రభుత్వాధికారులను కూడా వినియోగించడంతో వైసీపీ అండదండలతోనే డ్రగ్స్ వ్యవహారం నడుస్తోందని తేటతెల్లమౌతోంది. రూ. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ గట్టురట్టు కాకుండా వైసీపీ పెద్దల కోరిక మేరకు పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటెయినర్ ను తెరవకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఒత్తిడులకు లొంగకుంటా సీబీఐ అధికారులు కంటెయినర్ సీల్ తీశారు. సీల్ తీసిన సమయం నుంచి నాట్కో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు, మళ్లీ తిరిగి సీల్ చేయడం వరకు అన్నీ వీడియో తీయించారు. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాలపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పందించారు.. రెండేళ్ల క్రితమే బ్రెజిల్ లో వైసీపీ నేతలకు ఉన్న చీకటి వ్యాపారాల గురించి తాను చెప్పాననీ, ఇప్పుడు అదే నిజం అయ్యిందంటూ రెండేళ్ల క్రితం తాను మాట్లాడిన వీడియోను లోకేశ్ ఎక్స్ లో షేర్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోందని, అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైసీపీ చీకటి మాఫియాలతో జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయని లోకేశ్ విమర్శించారు. విశాఖలోని వైసీపీ నేతలకు చెందిన ఓ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్ అంటూ లోకేశ్ విమర్శించారు.
విశాఖలో దొరికిన భారీ డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలు ఉన్నట్లు ఆధారాలతో సహా బట్టబయలు అవుతున్న క్రమంలో ఆ పార్టీ పెద్దలు కొత్త ప్లాన్ కు తెరలేపారు. ఎప్పటిలాగే.. ప్రభఉత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి మా ప్రమేయం లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, వారు ఆధారాలు లేకుండా అబాండాలు వేస్తే మేము వాటికి సమాధానం చెప్పాలా? అంటూ సజ్జల ప్రశ్నించాడు. అంతే కాదు.. కంపెనీ ప్రతినిధులు వైసీపీ పార్టీ నేతలని సోషల్ మీడియాలో ప్లెక్సీలు రుజువు చేస్తున్నా.. సజ్జల మాత్రం కంపెనీ వాళ్లు పురందేశ్వరి, చంద్రబాబు బంధువులు అంటూ.. ఇదంతా ఓ సామాజిక వర్గం వాళ్లపనే అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు.. ఎన్నికల సమయం వచ్చిందంటే టీడీపీ ఏదో ఒక అభాండం వేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తుందంటూ సజ్జల చాలా అమాయకంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. దీంతో.. గత ఎన్నికల్లో బాబాయ్‌ను హత్యచేసి అధికారంలోకి వచ్చింది ఎవరు? ప్రజల సానుభూతి పొందేందుకు కోడికత్తి డ్రామా ఆడింది ఎవరు సజ్జలా? అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంకోసం ఎంతటి పనికైనా తెగించే వైసీపీ నేతలు.. ఇప్పుడు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరలేపుతుండటంతో ప్రజలు వైసీపీ నేతల తీరునే ఏవగించుకుంటున్నారు.