posted on Mar 20, 2024 12:58PM
ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి, పార్టీ నుంచి నేతల వలసలు, పార్టీ అగ్రనాయకత్వంపై అవినీతి ఆరోపణలు.. వంటివి ఎదుర్కొనే ధైర్యం, స్థైర్యం ఆయనలో పుష్కలంగా ఉన్నప్పటికీ, సొంత కుమార్తె కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం మాత్రం ఆయన ప్రతిష్టను ప్రజలలో బాగా పలుచన చేసిందని అంటున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ పార్టీ నుంచి వలసల విషయంలో కానీ, పార్టీ అగ్రనేతలు, మాజీ మంత్రులపై అవినీతి ఆరోపనలు వెల్లువెత్తుతున్నా గట్టిగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంటున్నారు.
వాస్తవానికి అవినీతి ఆరోపణలు ఆయనపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, మద్యం కుంభకోణంలో కుమార్తె ప్రమేయం ఆయన వ్యక్తిత్వంపైనే పెద్ద దెబ్బపడేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్గా , తెలంగాణ సంస్కృతికి ఐకాన్ గా పేరొందిన కవిత ప్రతిష్టను, ఇమేజ్ ను మద్యం కుంభకోణం తేరుకోలేనంతగా దెబ్బతీశాయనడంలో సందేహం లేదు. అంతే కాదు కవిత అరెస్టు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులు రాున్న లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయావకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి. ఇప్పుడు కేసీఆర్ దృష్టి అంతా తన కుమార్తె కవితకు బెయిలు అంశంపైనే కేంద్రీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీలో ట్రబుల్ మేకర్ గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా కవితకు బెయిలు తదితర అంశాలపై న్యాయనిపుణులతో చర్చించడం వంటి కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో పార్టీలో వలసన నిరోధానికి వీసమెత్తు ప్రయత్నం చేసేందుకు కూడా నాయకులు కరవయ్యారు. కౌషిక్ రెడ్డి వంటి వారు మీడియా ముందుకు వచ్చి ఫిరాయింపులపై ఏదో మాట్లాడినా ఆ ప్రభావం వలసకు రెడీ అయిన బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కట్టడి చేయలేకపోతోంది. అలాగే పార్టీ క్యాడర్ లో స్థైర్యాన్ని నింపలేకపోతున్నది.
వచ్చే లోక్సభ ఎన్నికలకు పార్టీ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చినా సిట్టింగ్ ఎంపీల నిష్క్రమణ కేసీఆర్ పరిస్థితి పార్టీలో ఎంత నిస్సహాయంగా మారింతో తేటతెల్లం చేస్తున్నది. లోక్ సభ ఎన్నికలలో లోపు ఆయన కుదురుకుని పార్టీ వ్యవహారాలపై సీరియస్ గా దృష్టి సారించగలిగే పరిస్థితులు కనిపించడం లేదు. ముందుగా కవితకు బెయిలు రావడంపైనే ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఒక వేళ బెయిలు వస్తే ఆ తరువాత ఆయన పార్టీ వ్యవహారాలపై కాన్ సన్ ట్రేట్ చేసే అవకాశం ఉంది. బెయిలు రావడంలో జాప్యం జరిగితే మాత్రం బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ సారథి లేని సైన్యం మాదిరి కకావికలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.