
- మున్సిపల్ వాహనాలకు ‘మరమ్మతు’ మోక్షం ఎప్పుడు?
- గాలికి వదిలేసిన అధికారులు..
- చెత్త కుప్పలమయంగా తాండూరు!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. గత కొన్ని నెలలుగా మున్సిపల్ కార్యాలయంలో మూలపడ్డ చెత్త సేకరణ వాహనాలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారుతున్నాయి. పట్టణాన్ని శుభ్రంగా ఉంచాల్సిన వాహనాలు రిపేర్ల పేరుతో కార్యాలయం ఆవరణలో తుప్పు పడుతుంటే, అటు అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పనిచేయని వాహనాలు.. పేరుకుపోయిన చెత్త
పట్టణంలోని వివిధ వార్డుల నుంచి చెత్తను సేకరించాల్సిన వాహనాలు చెడిపోవడంతో వాటిని నెలల క్రితం మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. చిన్నపాటి మరమ్మతులు చేయించి వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉండగా, అధికారులు మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వార్డుల్లో చెత్త సేకరణ సజావుగా సాగడం లేదు. ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి పట్టణం నరకాన్ని తలపిస్తోంది.
నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు..
చెత్త వాహనాలు లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలను రిపేర్ చేయిస్తే సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని తెలిసినా, మున్సిపల్ అధికారులు మాత్రం “ఆ ఊసే” ఎత్తడం లేదు. ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయాన్ని గాలికే వదిలేశారు. నిధులు ఉన్నా ఖర్చు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.చెత్త కుప్పల వల్ల దోమలు, ఈగలు పెరిగిపోయి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, మూలపడ్డ వాహనాలకు వెంటనే మరమ్మతులు చేయించి పారిశుద్ధ్య పనులను పరుగులు పెట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.



