- తాండూరు తాగునీటి కష్టాలకు శాశ్వత విముక్తి…
- కాగ్నా నీటి సరఫరాకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం
- సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ ప్రజల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి అధ్యక్షతన గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులపై సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో కాగ్నా నది నుండి నీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు, పట్టణంలోని అన్ని వార్డుల్లో అవసరమైన చోట కొత్త బోర్లు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనకు కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు.పట్టణంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా పనులను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు.తాండూరు నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తాండూరు ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.




