- సామాన్యుడిపై ఇంధన ‘మంట..!
- పెట్రోల్, గ్యాస్ కొరతపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ శర్మ ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి : దేశాన్ని వేధిస్తున్న ఇంధన సంక్షోభం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పి. ప్రసన్నకుమార్ శర్మ విమర్శించారు. అంతర్జాతీయ పరిణామాలను అంచనా వేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఫలితంగా సామాన్య ప్రజలు వీధుల పాలవుతున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. “పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఇరవై బంకులు తిరిగితే గానీ లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉందన్నారు. ఇది అభివృద్ధికి నిదర్శనమా?” అని ఆయన ప్రశ్నించారు. గ్యాస్ కొరత కారణంగా టిఫిన్ సెంటర్లు, చిన్నపాటి హోటళ్లు మూతపడుతున్నాయని, రోజువారీ కూలీలు ఆకలితో అలమటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విదేశాంగ విధానం వల్లే దేశానికి ఈ గతి పట్టిందని ఆయన విమర్శించారు. రష్యా వంటి మిత్ర దేశాలను దూరం చేసుకుని, అమెరికా వంటి దేశాల ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్లే ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరుగుతాయని తెలిసినా ముందస్తుగా నిల్వలు ఎందుకు సిద్ధం చేయలేదని కేంద్రాన్ని నిలదీశారు.బీజేపీ నాయకులకు ప్రజల కష్టాల కంటే ఎన్నికలు, కుర్చీలే ముఖ్యమని శర్మ ఎద్దేవా చేశారు. “దేశంలో ఇంధన నిల్వలు ఎన్ని ఉన్నాయో ప్రజలకు నిజం చెప్పే ధైర్యం కేంద్రానికి లేదన్నారు. ప్రజల కోపం ఎప్పుడైనా విరుచుకుపడవచ్చు. రాబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలు బీజేపీకి గట్టి బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఇంధన సరఫరాను పునరుద్ధరించి, సామాన్యుడిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




