- బిఆర్ఎస్, బిజెపిలు పేదల వ్యతిరేక పార్టీలు
- పదేళ్ల పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవి?
- కేంద్రం హామీలు అన్నీ డొల్ల మాటలే.. అభివృద్ధిని అడ్డుకుంటే ఖబర్దార్!
జనవాహిని ప్రతినిధి తాండూరు : అభివృద్ధిని అడ్డుకుంటూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బిఆర్ఎస్, బిజెపి నాయకులపై కాంగ్రెస్ పార్టీ 26వి వార్డ్ కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ నీతిని ఎండగట్టారు.పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. “దళిత బంధు పథకాన్ని సైతం అమ్ముకున్న చరిత్ర మీదని, పేదలకు ఇళ్లు ఇస్తే అమ్ముకుంటారనే నెపంతో వారి సొంతింటి కలను కాలరాశారు” అని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 11 ఏళ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు, అకౌంట్లలో 15 లక్షల రూపాయల హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప, నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ, ఐటిఐ కాలేజీ తెచ్చే మొహం మీకు ఉందా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రజల శ్రేయస్సు కోసమే నిరంతరం శ్రమిస్తుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తూ, పేద ఇంటి కలను చెరిపేయాలని చూస్తే బిఆర్ఎస్, బిజెపి నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని, ఖబర్దార్ అంటూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.




