Tuesday, May 12, 2026

― Advertisement ―

అబద్ధాల దీక్షలు.. బురిడీ మాటలు.. ..!

పదేళ్ల కరెంట్ దోపిడీని రైతులు మర్చిపోలేదు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్‌దే బిఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ వ్యాఖ్యలపై ఆగ్రహం....  ఆర్కెస్ట్రా నాయకుడు రాజు గౌడ్.... 26వ వార్డ్...
HomeNEWSఅక్రమ సెల్లార్ పూడ్చివేత...!

అక్రమ సెల్లార్ పూడ్చివేత…!

spot_img
  • నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు.. స్పందించిన మున్సిపల్ యంత్రాంగం
  • టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యంపై మాజీ కౌన్సిలర్ ఆగ్రహం
  • లంచం డిమాండ్ చేసిన అధికారిని చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని 20వ వార్డు గాంధీనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా, మున్సిపల్ అనుమతులు లేకుండా చేపట్టిన డబుల్ సెల్లార్ తవ్వకాలను మున్సిపల్ అధికారులు మంగళవారం ఉదయం నిలిపివేయించారు. కమిషనర్ ఆదేశాల మేరకు జెసిబి సహాయంతో తవ్విన గుంతలను మట్టితో పూడ్చివేసి యధాతథ స్థితికి తీసుకొచ్చారు.స్థానిక ఇంటి నంబరు 6-8-61/16 డీ వెనుక భాగంలో గత నెల ఏప్రిల్ 30న భారీ సెల్లార్ కోసం తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాల వల్ల పక్కనే ఉన్న ఇళ్ల పునాదులు కదిలి, మట్టి, రాళ్లు జారిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ ఇళ్లు ఎక్కడ కూలిపోతాయోనన్న ఆందోళనతో వారు అధికారులను ఆశ్రయించారు.ఈ ప్రమాదకర పరిస్థితిపై మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో రాజేశ్వరి, సక్కుబాయి, పురుషోత్తం తదితరులు వారం రోజుల క్రితమే టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. అయితే, టౌన్ ప్లానింగ్ అధికారి భూపతి రాజకీయ నాయకులతో చేతులు కలిపి, చర్యలు తీసుకోవడానికి లంచం డిమాండ్ చేశారని, వారం రోజులైనా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి మరియు నిర్లక్ష్యంపై సోమవారం బాధితులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న కమిషనర్, తక్షణమే స్పందించి మంగళవారం ఉదయం 7 గంటలకే సిబ్బందిని, జెసిబిని ఘటనా స్థలానికి పంపించారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించి, అక్రమ తవ్వకాలను పూడ్చివేయించారు.ప్రజా సమస్యపై తక్షణమే స్పందించిన కమిషనర్‌కు మాజీ కౌన్సిలర్ సంగీత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఇలాంటి సమర్థవంతమైన కమిషనర్‌ను చూడలేదన్నారు. ఆయన పనితీరు అభినందనీయమని కొనియాడారు. అయితే, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ లంచాలు అడుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి భూపతిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అధికారులు ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరించాలని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను వేధించవద్దని ఆమె హెచ్చరించారు.