- వెలవెలబోతున్న ‘వినాయక’.. వైభవం ఏమైంది…?
- తాండూరులో సేవలు నిలిచిపోయిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
- నెల రోజులుగా వైద్యులు, సిబ్బంది గైర్హాజరు
- బిల్లు కట్టకపోవడంతో 20 రోజులుగా నిలిచిన విద్యుత్
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఎంతో ఆర్భాటంగా, హంగు ఆర్భాటాలతో ప్రారంభమైన వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇప్పుడు దిక్కులేని స్థితికి చేరుకుంది. తాండూరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం, ముఖ్యంగా గుండె సంబంధిత చికిత్సలను చేరువ చేస్తామని నమ్మబలికిన యాజమాన్యం, ప్రస్తుతం ఆసుపత్రిని గాలికొదిలేసింది. గత నెల రోజులుగా ఆసుపత్రిలో సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆసుపత్రి నిర్వహణలో యాజమాన్యం విఫలమైందనడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు సరఫరాను నిలిపివేశారు. గత 20 రోజులుగా ఆసుపత్రి చీకటిలోనే మగ్గుతోంది. లక్షల రూపాయల ఖరీదైన వైద్య పరికరాలు విద్యుత్ లేక, వాడక లేక పాడయ్యే స్థితికి చేరుకున్నాయి.ప్రారంభంలో వందలాది మంది సిబ్బంది, రోగులతో కిటకిటలాడిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు కనీసం పలకరించే నాథుడు లేడు.కీలకమైన విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఆసుపత్రికి రావడం మానేశారు.జీతభత్యాల సమస్య లేదా యాజమాన్య వైఖరితో సిబ్బంది కూడా విధులకు దూరమయ్యారు. తాండూరులో గుండె చికిత్స అందుబాటులోకి వచ్చిందని ఆశపడ్డ ప్రజలకు ఇప్పుడు నిరాశే మిగిలింది.తొలిసారిగా గుండె సంబంధిత చికిత్సల కోసం అత్యాధునిక సదుపాయాలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి, ఇంత త్వరగా మూతపడటంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. ప్రారంభంలో చేసిన ప్రచారానికి, ప్రస్తుత పరిస్థితికి పొంతన లేదని ప్రజలు మండిపడుతున్నారు. దిక్కులేని ఆసుపత్రిగా మారిన వినాయక సూపర్ స్పెషాలిటీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.




