ఒకప్పటి టాప్ కమెడియన్ పద్మనాభంకు తిరుపతి ప్రకాష్ ఏమవుతాడో తెలుసా?
Jul 11, 2026 8:12PM
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా, ప్రతిభావంతుడైన దర్శకుడిగా, అభిరుచి గల నిర్మాతగా తనదైన ముద్ర వేసిన మహానటుడు పద్మనాభం. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 400 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు అగ్ర నటుడిగా వెలుగొంది, అప్పటి కాలంలోనే ఒక్కో సినిమాకు భారీ పారితోషికం అందుకున్న ఘనత ఆయనది. అయితే, వెండితెరపై కోట్లాది మందిని నవ్వించిన ఈ హాస్య బ్రహ్మ జీవితంలో చివరి రోజుల్లో మాత్రం తీవ్రమైన విషాదం నెలకొంది. నమ్మినవారే నట్టేట ముంచడంతో ఆయన తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నారనే చేదు నిజాన్ని తాజాగా ఆయన కుటుంబ సభ్యుడు, జబర్దస్త్ ఫేమ్ తిరుపతి ప్రకాష్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
కమెడియన్ పద్మనాభం తనకు వరుసకు పెద్దనాన్న అవుతారని తిరుపతి ప్రకాష్ ఈ సందర్భంగా వెల్లడించారు. పద్మనాభం స్వగ్రామం కడప సమీపంలోనే ఉంటుందని, తన చిన్నతనంలోనే తన ఫోటోలు చూసి, తమ ఇంట్లో జరిగే వేడుకలకు పెద్దనాన్న వచ్చేవారని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, గతంలో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, జె.డి. చక్రవర్తి హీరోలుగా వచ్చిన ఒక సినిమాలో తాను, పెద్దనాన్న పద్మనాభం కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నామని తెలిపారు. అయితే అంతటి ఘన చరిత్ర ఉన్న నటుడు కెరీర్ ముగింపు దశలో ఎదుర్కొన్న కష్టాలు వింటే గుండె తరుక్కుపోతుందని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.
పద్మనాభం గారు కేవలం నటనకే పరిమితం కాకుండా సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో అడుగుపెట్టి భారీగా నష్టపోయారని ప్రకాష్ తెలిపారు. ముఖ్యంగా గుంతకల్‌లోని ‘బసవరాజా డిస్ట్రిబ్యూషన్స్’ వల్ల ఆయనకు ఊహించని స్థాయిలో పెద్ద నష్టం వాటిల్లిందని విన్నారు. పరిశ్రమలో తనకు బాగా తెలిసినవారే, తాను ఎంతగానో నమ్మినవారే ఆయనను దారుణంగా మోసం చేశారని చెప్పారు. ఈ వరుస నష్టాల కారణంగా ఆయన జీవితం చివరి అంకంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను చవిచూడాల్సి వచ్చింది. చనిపోయే సమయానికి ఆయన ఒక దిగువ మధ్యతరగతి స్థితికి చేరుకున్నారని, చివరికి చెన్నైలో ఉన్న సొంత ఇల్లు కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందని తిరుపతి ప్రకాష్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం పద్మనాభం పిల్లలతో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కూడా స్పష్టం చేశారు.