- యాలాల తహసీల్దార్ ఆఫీసులో ‘లంచాల’ పర్వం!
- డిప్యూటీ ఎంఆర్వో రూ.50 వేలు.. బంటు రూ.20 వేలు అడుగుతున్నారు
- ఆరు నెలలైనా కాని పట్టా రిజిస్ట్రేషన్.. కలెక్టర్‌కు మాజీ సర్పంచ్ ఫిర్యాదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : యాలాల మండల రెవెన్యూ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని బషీర్మీయా తండా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ అన్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్టా భూమి రిజిస్ట్రేషన్ కోసం గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు లంచం కోసం కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.గత 2025 డిసెంబర్‌లోనే అప్పటి ఆర్‌ఐ, సర్వే సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి నివేదిక ఇచ్చారని, అయినా ప్రస్తుత డిప్యూటీ ఎంఆర్వో కిరణ్ కుమార్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని మిత్రు నాయక్ మండిపడ్డారు. పట్టా రిజిస్ట్రేషన్ చేయాలంటే డిప్యూటీ ఎంఆర్వో నేరుగా రూ.50 వేలు డిమాండ్ చేస్తున్నారని, కార్యాలయంలో ఉండే వీఆర్‌ఏ బంటు శ్రీనివాస్ మరో రూ.20 వేలు లంచం అడుగుతున్నాడని బహిరంగంగా ఆరోపించారు. చిన్న భూకమతాల రిజిస్ట్రేషన్లకు కూడా పది నుండి ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యాలయంలో ఏ పని కావాలన్నా ‘శీనుని అడుగు’ అని చెబుతున్నారని, అసలు ఆ శీను ఎవరు? అతనికి ఆఫీసులో ఏం పని అని నిలదీశారు. గ్రామాల్లో ఉండాల్సిన బంట్లను ఆఫీసుల్లో కూర్చోబెట్టి లంచాల దందా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ అవినీతిపై ఇప్పటికే అన్ని రికార్డులు, సర్వే రిపోర్టులతో సహా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. లంచగొండి డిప్యూటీ ఎంఆర్వో కిరణ్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఇక్కడి అక్రమాలకు అండగా నిలుస్తున్న బంటు శ్రీనివాస్‌ను ఆఫీసు నుండి తొలగించాలని స్థానిక ఎమ్మెల్యేను, ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు.




