పొలంలో ఉరేసుకొని భార్యాభర్తలు ఆత్మహత్య
నాగర్ కర్నూల్ జిల్లా బాల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు తమ వ్యవసాయ క్షేత్రంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జూనుకుంట గ్రామానికి చెందిన మహేష్, అదే ప్రాంతానికి చెందిన భానుమతి గత ఏడాది కాలంలో ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం సైతం చేసుకున్నారు. అయితే భానుమతి మైనర్ కావడంతో మహేష్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. దీంతో అతడు కొన్ని రోజులు జైలుకి వెళ్లివచ్చాడు. వచ్చిన తరువాత కొన్ని నెలల వరకు బాగానే ఉన్నా…ఉన్నఫళంగా ఏం జరిగిందో తెలియదు. శనివారం రాత్రి తమ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్టుకు ఇద్దరూ ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. దీంతో ఇద్దరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.