posted on Jun 9, 2024 9:37PM
పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎంసెట్‌లో 27వ ర్యాంక్ సాధించి, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి అమెరికా వెళ్ళిన ఆయన అక్కడ కూడా అత్యధిక మార్కులు సాధించారు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేసిన ఆయన అతి తక్కువకాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్.కి హాజరయ్యే విద్యార్థుల లకోసం ‘యూ వరల్డ్’ పేరుతో ఆన్‌లైన్ శిక్షణ సంస్థను స్థాపించి ఘన విజయం సాధించారు. తన సంస్థను వేల కోట్ల రూపాయల విలువైన సంస్థగా ఎదిగేలా చేశారు.
మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీతో అనుబంధం వున్న పెమ్మసాని చంద్రశేఖర్ 2014లోనే నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాల్సింది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. 2024 ఎన్నికలలో పెమ్మసాని గుంటూరు స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
పెమ్మసాని పుట్టిన ఊరు బుర్రిపాలెం. తల్లిదండ్రులు సువర్చల, పెమ్మసాని సాంబశివరావు, భార్య డాక్టర్ రత్నశ్రీ, కుమారుడు పెమ్మసాని అభినవ్, కుమార్తె పెమ్మసాని సహస్ర.