posted on Apr 19, 2024 11:54AM
ఆర్ఎస్ఎస్ వినా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్న అభిప్రాయాలన్నీ రాజకీయ వైరంతో చెబుతున్న మాటలు, జోశ్యాలుగా కొట్టి పారేసినా బీజేపీ మెంటార్ రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రం ఆలోచించాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ రెండోందలకు మించి స్థానాలను గెలుచుకునే పరిస్థితి లేదని తేలింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అంచనా ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గణనీయంగా సీట్లను నష్టపోతున్నది. ఆర్ఎస్ఎస్ చెబుతున్న దానిని బట్టి చూస్తే బీజేపీ సొంతంగా 178 స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది. అంటే క నీసం 300 స్థానాల సొంతంగా విజయం అన్న బీజేపీ లక్ష్యం నెరవేరే చాన్సే లేదు.
వాస్తవానికి గత కొన్ని నెలలుగా పరిశీలకులు వైసీపీకి ఉత్తరాదిలో ఆదరణ తగ్గుతోందంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఆక్కడ తగ్గే స్థానాలను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. అయితే దక్షిణాదిలో ఒక్క కర్నాటక వినా ఆ పార్టీకి పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. నిన్న మొన్నటి వరకూ అక్కర్లేదు మేమే చాలు అంటూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకున్న కమలనాథులు ఇప్పుడు చిన్నా చితకా పార్టీలను కూడా ఎన్డీయేలోకి ఆహ్వానిస్తూ.. మరో సారి అధికారంలోకి వస్తే కచ్చితంగా మిత్రధర్మాన్ని పాటించి భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తామని నమ్మకంగా చెబుతున్నారు. ఉత్తరాదిలో బలమైన రాజపుట్లు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారడం కూడా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేందుకు కారణమైందని అంటున్నారు.
బీజేపీ ప్రముఖుడు ఇటీవల రాజ్పుట్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ ప్రభావం ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపడానికి కారణమయ్యాయి. ఇక ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం కూడా, బీజేపీకి మైనస్ అయ్యిందన్నది పరిశీలకుల విశ్లేషణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఇటీవల వెల్లడించిన వివరాలలో ఈడీ-సీబీఐ కేసులకు గురైన కంపెనీలన్నీ తర్వాత, బీజేపీకి భారీ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చాయతేలడం బీజేపీకి భారీ నష్టం చేకుర్చనుందని అంటున్నారు. ఏయే కంపెనీ బీజేపీకి ఎంతెంత విరాళాలు ఇచ్చిందన్న వివరాలు గత కొద్దిరోజు నుంచి మీడియాలో శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. అది సహజంగానే బీజేపీకి కొంత నష్టం కలిగి ఉండవచ్చంటున్నారు.