posted on Apr 6, 2024 11:15AM
గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీకి కిలారు రోశయ్య వెనుకంజ
మళ్లీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్
అళ్లను బరిలోకి దింపే యోచన
ఓడినా సరే పోటీ చేయాలని ఆర్కేకు జగన్ హుకుం?
గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడి కొత్తి డ్రామాతో ప్రజల్లో సానుభూతితో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఈసారి జగన్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు అన్నివర్గాల ప్రజలు ఏకమైనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ముందుగానే ఓటమిని ఒప్పుకొని పోటీనుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు వైసీపీ అభ్యర్థులు వణికిపోతున్నారని చెబుతున్నారు. ఓడిపోయే సీటులో పోటీచేసేకంటే.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే బెటర్ అనే నిర్ణయానికి వైసీపీ అభ్యర్థులు వస్తున్నారు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో గత రెండు దఫాలుగా తెలుగుదేశం అభ్యర్థిగా గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈసారి ఆయన రాజకీయాలకు విరామం ఇవ్వడంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. పేద వర్గాల ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా ఉంటూ వస్తున్నారు. పెమ్మసానికి నియోజకవర్గంలో మంచిపేరు ఉంది. నియోజకవర్గంలో పెమ్మసాని విజయం ఖాయమని వైసీపీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.
దీంతో పెమ్మసానిపై పోటీ చేసేందుకు వైసీపీ నేతలు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. చివరకు జగన్ ఆదేశాల మేరకు కిలారు కోశయ్య గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయనకూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ సైతం పెమ్మసానికే జై కొడుతున్నారనీ, దీంతో పోటీలో నిలిచి ఓడిపోవడం కంటే పోటీ నుంచి తప్పుకోవటం మేలన్న భావనకు కిలారు రోశయ్య వచ్చారనీ గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తొలుత క్రికెటర్ అంబటి రాయుడును బరిలోకి దింపాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారు. అయితే, ఆయన పార్టీలో చేరిన కొద్దికాలంకే వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా నర్సరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులును పోటీ చేయాలని జగన్ సూచించారు. ఆయన అందుకు ససేమిరా అనడంతో నర్సరావుపేట నుంచి మరోసారి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించాడు. దీంతో శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశంలో చేరి మరోసారి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ కు పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకూడా పోటీ చేసేందుకు నిరాసక్తతను వ్యక్తం చేయడంతోపాటు.. రెండు వారాలైనా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఉమ్మారెడ్డి అల్లుడు అయిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యను గుంటూరు అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దించారు. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనసైతం పోటీనుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. పెమ్మసాని రాజకీయ వ్యూహాలకు నియోజకవర్గంలో వైసీపీ నేతలు సైతం ఫిదా అవుతున్నారట. దీంతో పలువురు వైసీపీ నేతలు సైతం లోపాయికారికంగా పెమ్మసాని విజయంకోసం పనిచేస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతున్నది. దీంతో ఎంత ప్రయత్నించినా నియోజకవర్గంలో వైసీపీ విజయం అసాధ్యమని కిలారు రోశయ్య పార్టీ నేతల వద్ద పేర్కొన్నారని సమాచారం. పెమ్మసాని విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని, ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంకంటే తప్పుకోవటం మేలన్న భావనను పార్టీ నేతల వద్ద కిలారు రోశయ్య ప్రస్తావించినట్లు గుంటూరు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఆయనపై పోటీకి వైసీపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగాఉన్న కిలారు రోశయ్య కూడా పోటీనుంచి తప్పుకుంటానని వైసీపీ అధిష్టానం వద్ద వెల్లడించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కిలారు రోశయ్య స్థానంలో గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఓడిపోయినా సరే.. పోటీలో మాత్రం ఉండడాలని వైసీపీ అధిష్టానం ఆళ్లకు సూచించినట్లు సమాచారం. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ దెబ్బకు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వైసీపీ ఓటమిని ఒప్పుకున్నట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.