చెల్లిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే బెంగతో అన్న ఆత్మహత్య
చెల్లిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే బెంగతో ఓ అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా(Siddipet Crime) అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన భాషవేణి కొంరయ్య,తిరుపతమ్మ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు రాజ్ కుమార్ (22) ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా వీరికున్న భూమిలో రెండు ఎకరాల భూమి అమ్మి ఆరు నెలల క్రితం చెల్లిని హుస్నాబాద్ మండలం తోటపెళ్లికి చెందిన యువకుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి అయిన రెండు, మూడు నెలలు సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు అత్తారింట్లో వేధింపులు మొదలయ్యాయి. దీంతో పలుమార్లు పెద్దమనుసుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. అయినా వారిలో మార్పు రాలేదు. దీంతో చెల్లి పుట్టింట్లో ఉంటుంది. మరల ఈ నెల 28న మరోసారి పంచాయితీ పెట్టారు. అమ్మాయి నచ్చలేదంటూ అతింటివారు తీసుకెళ్లటానికి ఒప్పుకోకపోగా, విడాకులు ఇస్తామని చెప్పారు. దీంతో రాజ్ కుమార్ చెల్లి సంసారం నాశనం అయ్యిందనే మనస్తాపంతో తల్లికి ఫోన్ చేసి పురుగుల మందు(Brother Suicide) తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న రాజ్ కుమార్ ను కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.