దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీని మరో పదేళ్ళ పాటు పదిలంగా నిలపడానికి బదులు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం శ్రమించిన వారిలో ముఖ్యులకు కార్పొరేషన్ పదవులను కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు జిల్లాల వారీగా జాబితాలను సిద్ధం చేసి ఏఐసీసీకి ప్రతిపాదించారు. ప్రతిపాదన ఆధారంగా ఉమ్మడి జిల్లాలో నలుగురికి దక్కాయి. మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా మహిళా నాయకురాలు నేరెళ్ళ శారద, సుడా చైర్మన్ గా సిటి కాంగ్రెస్ అద్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మంథని నియోజకవర్గానికి చెందిన అయిత ప్రకాశ్ రెడ్డి, పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం కు చెందిన జనక్ ప్రసాద్ కు మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా నియమించారు. అందులో జనక్ ప్రసాద్, ప్రకాశ్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు శారద, నరేందర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినవారు. అయితే ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోకుండా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు కు అనుకూలంగా వ్యవహరించే వారికే పదవులు దక్కాయని పొన్నం అనుచరులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.