Home తెలంగాణ కంటోన్మెంట్ లో బీజేపీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. ట్విస్ట్ మామూలుగా లేదుగా?! | congress shock...

కంటోన్మెంట్ లో బీజేపీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. ట్విస్ట్ మామూలుగా లేదుగా?! | congress shock to bjp in contonment| by| poll| candidate| jump| kamalam| in| search| new

0

posted on Mar 20, 2024 6:05PM

తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మామూలుగా లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యాంరంటీల హామీలను చాలా వరకూ చెప్పినట్లుగానే వంద రోజుల వ్యవధిలో అమలు చేయడంతో ప్రజలలో కూడా కాంగ్రెస్ సర్కార్ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో విజయం సాధించాలన్న పట్లుదలతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నడంలో వాటిని అమలు చేయడంలో ప్రత్యర్థి పార్టీల కంటే రెండడుగులు ముందే ఉన్నట్ల పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇలా ఉండగా తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి  ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మామూలుగా అయితే కంటోన్మెంట్ నియోజకవర్గ టికెట్ ను బీఆర్ఎస్ లాస్య నందిత కుటుంబ సభ్యులకే ఇచ్చినట్లైతే రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టరు. కానీ ఈ సారి సార్వత్రిక ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుండటంతో  కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టక పోతే ఆ ప్రభావం లోక్ సభకు పోటీ చేసే పార్టీ అభ్యర్థి విజయావకాశాలపై  పడే అవకాశం ఉండటంతో  కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వెన్నెల పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి  గణేష్ నారాయణన్ తరువాత మూడో స్థానంలో నిలిచారు. కాగా తొలుత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా వెన్నెలకే పార్టీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ, ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న మరో నేత అయితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని రేవంత్ రెడ్డి భావించారు.

దీంతో కాంగ్రెస్  బీజేపీ స్థానిక నేత గణేష్ నారాయణన్ కు గాలం వేసింది. మంగళవారం (మార్చి 19) సాయంత్రం వరకూ   మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి  ఈటెల రాజేందర్ కోసం ప్రచారం చేసిన గణేష్ నారాయణన్ రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్ ఆఫర్ ను అంగీకరించేందుకు ఆయన కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలన్న షరతు పెట్టారనీ, స్థానికంగా గణేషన్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అందుకు అంగీకరించిదనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్థారణ కాలేదు. ఈ స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఇక్కడ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ అయితే గణేషన్ పార్టీ వీడటంతో షాక్ కు గురైంది. ఇప్పటి వరకూ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆయనే అభ్యర్థి అని ఫిక్స్ అయిన బీజేపీ, ఇప్పుడు ఇక్కడ పోటీకి మరో వ్యక్తిని వెతుక్కోవలసిన పరిస్థితిలో పడింది. 

Exit mobile version