posted on Mar 17, 2024 11:40AM
వివేకా వర్ధంతి సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై చెల్లెళ్లు షర్మిల, సునీతారెడ్డిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్‌రెడ్డే వివేకాను చంపారు అన్న పదం తప్ప వివేకా హత్యలో జగన్ పాత్ర ఉందని వాళ్లు తమ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు. వివేకాను చంపింది వైసీపీ ఎంపీ అవినాశ్ అని సీబీఐ అధికారులు తేల్చినప్పటికీ ఎందుకు కాపాడుతున్నావ్ అంటూ జగన్ ను నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులతో పాటు రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగినా వారికి అండగా ఉండటంలో ముందుండేవారు. వాళ్ల వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం సొంత బాబాయ్ ను హత్య చేసిన నిందితులు కళ్లముందే ఉన్నా వాళ్లను జైలుకు పంపించకుండా, తిరిగి బాబాయ్ కుటుంబాన్ని, సొంత చెల్లెళ్లను సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసి, నిందలు మోపుతున్నారు. అలాంటి జగన్ వైఎస్ కుటుంబానికి ఎలా వారసుడు అవుతావంటూ జగన్ చెల్లెళ్లు ప్రశ్నించారు. వివేకానందరెడ్డిని హత్యచేసిన హంతకులను జైలుకు పంపించాలని సునీత చేసే ధర్మపోరాటానికి తాను ఆయుధం అవుతా అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించడం ప్రజలను ఆలోచింపజేస్తున్నది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, సొంత బాబాయ్ చనిపోయినా పట్టించుకోడు.. సొంత చెల్లెలు కన్నీరు పెట్టినా పట్టదు. అలాంటి జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతాడన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య విషయంలో సొంత చెల్లెళ్ల నుంచి, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకుసమాధానం చెప్పకుండా ఎన్నాళ్లు తప్పించుకొని తిరుగుతారు జగన్మోహన్ రెడ్డీ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుసైతం పలు సభల్లో వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలోకి ఉండి సొంతబాబాయ్ ను హత్యచేసిన నిందితులను కటకటాల వెనుక్కు పంపించలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సైతం తన భర్త హత్యకు కారణమైన నిందితులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయినా, జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించక పోవటం పలు అనుమానాలకు తావునిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, మెజార్టీ ప్రజలు వివేకా హత్య విషయంలో జగన్ పాత్ర ఉందన్నఅభిప్రాయానికి వచ్చేస్తున్నారు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఈ దఫా ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వైసీపీని వీడుతున్న నేతల సంఖ్యా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. జగన్ ఐదేళ్ల అస్తవ్యస్త పాలన, కక్షపూరిత రాజకీయాలతో విసిగిపోయిన జనం ఈసారి కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైనప్పటికీ.. కడప జిల్లాలో ముఖ్యంగా జగన్ పోటీచేసే పులివెందుల నియోజకవర్గంలో ఎదురుండదని ఇన్నాళ్లూ వైసీపీ నేతలు భావించారు. కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పులివెందుల ప్రజలు కూడా జగన్ పట్ల ఆగ్రహంతో ఉన్నారని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితులను కటకటాల వెనక్కు పంపించకపోగా.. సొంత చెల్లెళ్లు, సొంత పిన్నిపై, వారి కుటుంబంపైనే కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా జగన్ వ్యవహరిస్తుండటంతో పులివెందుల ప్రజలు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. దీనికి తోడు కడప ఎంపీ స్థానంలో వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేదా ఆయన కుమార్తె సునీతారెడ్డిలలో ఒకరు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది..వారిలో ఎవరు పోటీలో నిలిచినా వారికి అండగా నిలుస్తామని పలు పార్టీలకు చెందిన స్థానిక నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. కడప ఎంపీ స్థానం నుంచి మరోసారి అవినాశ్ రెడ్డే పోటీ చేస్తున్నారు. కడప పార్లమెంట్ నుంచి సౌభాగ్యమ్మ బరిలోకి దిగితే అవినాశ్ రెడ్డితోపాటు, పులివెందులలో జగన్ కుసైతం ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావటం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.