
- శ్రీ సాయి మేధ విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం పాఠశాల ఆవరణలో ముందస్తుగా నిర్వహించిన ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి.విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో తీరొక్క రంగులతో వేసిన అందమైన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల వేషధారణలతో విద్యార్థులు సంక్రాంతి పండుగ వైభవాన్ని కళ్లకు కట్టారు. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా విద్యార్థుల ఆటపాటలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా పాఠశాలలో అన్ని రకాల పండుగలను నిర్వహిస్తూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి పండుగ వెనుక ఒక విశిష్టమైన జీవనశైలి దాగి ఉందన్నారు. విద్యార్థులకు పండుగ గొప్పదనాన్ని వివరించినట్లు ఆయన పేర్కొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు మరియు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.



