
- జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించాలి
- అండర్-19 క్రికెట్ ప్లేయర్ అంచల్ పండిత్ ను సన్మానించిన చైతన్య కళాశాల యాజమాన్యం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని అంచల్ పండిత్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలో పాల్గొని జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయింది. దీంతో శుక్రవారం చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి కళాశాల సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో చక్కగా రాణించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఇంటర్ లో చక్కగా చదువుకుంటూనే జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషం అన్నారు. భారత్ క్రికెట్ టీంకు ఎన్నికై తల్లిదండ్రులతోపాటు కళాశాలకు ముఖ్యంగా తాండూరుకే మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించేందుకు అంచల్ పండితును ప్రోత్సహించిన తల్లిదండ్రులు రాంపండిత్, జ్యోతిలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందనే మాటను మరోసారి నిలబెట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జగ్జీవన్ రెడ్డి, కళాశాల నిర్వాహకులు రాము, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి వున్నారు.



