- ఎమ్మెల్యేపై కేసులు పెట్టడం బీఆర్ఎస్ కుట్రే..!
- మున్సిపల్ కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప బీఆర్ఎస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఫిర్యాదులు చేస్తున్నారని ఎల్లప్ప విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని, చట్టంపై గౌరవం ఉంటే గతంలో మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమపై ఉన్న నాన్-బేయిలబుల్ కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీఆర్ఎస్ నేతలు ఈ డ్రామాలాడుతున్నారు. రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని, అబద్ధపు కేసులతో ఎమ్మెల్యేను ఎదుర్కోవడం వారి తరం కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు పరాభవం తప్పదు అని ఎల్లప్ప హెచ్చరించారు.




