- ఎండలు మండుతున్నా జాడ లేని చలువ కేంద్రాలు
- అంబలి, మజ్జిగ పంపిణీపై మున్సిపాలిటీ నిర్లక్ష్యం
- నేతల మధ్య ‘రాజకీయ సెగలు’.. జనం గొంతులో ‘పొడి సెగలు’
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరులో భానుడు భగభగలాడుతున్నాడు. పట్టణ ప్రజలు నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా ఫీలవుతున్నారు. రోడ్ల మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే, ఏటా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసే ప్రభుత్వ అంబలి కేంద్రాలు, ఉచిత తాగునీటి కేంద్రాలు ఈసారి మచ్చుకైనా కనిపించడం లేదు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో సామాన్యులు ‘చుక్క నీటి’ కోసం అల్లాడిపోతున్నారు.సాధారణంగా ఏప్రిల్ నెల నుంచే తాండూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి, మజ్జిగ పంపిణీ కేంద్రాలు వెలిసేవి. కూలీలు, బాటసారులు ఈ కేంద్రాల వద్ద సేదతీరేవారు. తాండూరు పట్టణానికి వేరే ప్రాంతాల ప్రజలు కూడా రోజు వస్తు పోతు ఉంటారు. వారికీ కనీసం నీరు తాపే స్థితిలో కూడా తాండూరు లేదు అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నా ఒక్కటంటే ఒక్క కేంద్రం కూడా ఏర్పాటు కాకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు.పట్టింపు లేని ప్రజాప్రతినిధులు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా, చలువ కేంద్రాలు లేక జనం ఇబ్బంది పడుతున్నా స్థానిక నేతలు మాత్రం విమర్శలకే పరిమితమయ్యారు. పార్టీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోందే తప్ప, ప్రజల అవసరాలు ఎవరికీ పట్టడం లేదు. “ఓట్ల కోసం వచ్చే నేతలు.. దాహం వేస్తే నీళ్లు ఇచ్చేందుకు రావడం లేదు” అని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఎండల తీవ్రతను గమనించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తాండూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.




