
- బషీరాబాద్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి..నలుగురు అరెస్ట్
జనవాహిని ప్రతినిధి తాండూరు : బషీరాబాద్ మండల కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం…బషీరాబాద్ గ్రామంలోని హన్మయ్య గౌడ్ కల్లు కాంపౌండ్ పక్కన గల ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు మూడు ముక్కలాట ఆడుతున్నారని పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.చవాన్ శివరాం (పర్శనాయక్ తాండ), యం.డి. శాబుద్దిన్ (బషీరాబాద్),మహమ్మద్ మహబూబ్ (బషీరాబాద్), సి. శ్రీనివాస్ (బషీరాబాద్)నిందితుల వద్ద నుండి రూ. 1,360/- నగదుతో పాటు పేకాట ముక్కలను పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అక్రమంగా జూదం ఆడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బషీరాబాద్ సబ్-ఇన్స్పెక్టర్ యండి. నుమాన్ ఆలి హెచ్చరించారు.



