
- బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి జాతర!
- నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగికి మళ్లీ పట్టం
- – ఎంపీడీవో అండదండలతోనే అక్రమ నియామకం?
- – భారీగా చేతులు మారిన ముడుపులు.. విచారణకు విపక్షాల డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, జిల్లా అధికారుల చేత వేటుకు గురైన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని, నిబంధనలకు విరుద్ధంగా తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో స్థానిక ఎంపీడీవో పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గతంలో జరిగిన ఎన్నికల సమయంలో సదరు ఉద్యోగి నిబంధనలను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సదరు వ్యక్తిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అతడిని ఉద్యోగం నుండి తొలగించారు.
డబ్బు ప్రలోభంతో మళ్లీ విధుల్లోకి..
ఉద్యోగం కోల్పోయిన సదరు వ్యక్తి, ఎంపీడీవోను ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం తొలగించబడిన వ్యక్తిని తిరిగి తీసుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ, భారీగా ముడుపులు అందడంతో ఎంపీడీవో అతనికి తిరిగి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించారని మండల కేంద్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను కాదని, ఒక పార్టీకి కొమ్ముకాసిన వ్యక్తికి మళ్లీ అవకాశం కల్పించడం వెనుక పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోవడమే కాకుండా, ఉన్నతాధికారులే అవినీతికి పాల్పడటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బషీరాబాద్ ఎంపీడీవో తీరుపై విచారణ జరపాలని, అక్రమంగా నియమించబడిన ఉద్యోగిని వెంటనే తొలగించాలని మండల ప్రజలు మరియు విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.



