
- తాండూరు నడిబొడ్డున ‘మురుగు’ కంపు
- అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇది ఏదో మారుమూల గల్లీలో ఉన్న సమస్య కాదు.. పట్టణానికి తలమానికమైన ఇందిరా చౌరస్తా, శాంతిభద్రతలను కాపాడే పోలీస్ స్టేషన్, వెలుగులను ఇచ్చే విద్యుత్ కార్యాలయం.. వీటన్నింటికీ ఎదురుగా, ప్రధాన రహదారిపై దర్శనమిస్తున్న మురుగు కాలువ దుస్థితి. మున్సిపల్ పారిశుధ్య అధికారుల కళ్లు గప్పి ఈ మురుగు ఏరులై పారుతుంటే, అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.పట్టణంలో అత్యంత కీలకమైన ప్రాంతాల్లోనే పారిశుధ్యం పడకేసిందంటే, ఇక వార్డుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్ మరియు విద్యుత్ కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాల ముందే కాలువలు నిండిపోయి, మురుగు నీరు రోడ్డుపైకి చేరుతున్నా అధికారులకు పట్టనట్లు వ్యవహరించడం విచారకరం.ప్రతిరోజూ వందలాది వాహనాలు, వేలాది మంది ప్రజలు తిరిగే ఇందిరా చౌరస్తాలో ఈ పరిస్థితి మున్సిపల్ యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. పారిశుధ్య నిర్వహణపై సమీక్షలు జరిపే అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న ఈ గలీజును ఎందుకు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.నిలిచిన మురుగు నీటి వల్ల దోమలు పెరిగి, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అదేవిదంగా ఇదే ప్రధాన రహదారిపై మూత్రశాలగా మారింది ఈ ప్రధాన డ్రైనేజీ. ఇప్పటికైనా మున్సిపల్ పారిశుధ్య విభాగం అధికారులు స్పందించి, తక్షణమే కాలువలను శుభ్రం చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



