- తండ్రి ఆశయ సాధనే లక్ష్యం
- 4వ వార్డు అభివృద్ధికి కంకణం
తాండూరు, జనవాహిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు బీసీ మహిళకు రిజర్వు కావడంతో, ఆ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గోటిగ విజయలక్ష్మి ప్రకటించారు.పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, స్వర్గీయ గోటిగ సురేష్ కుమార్తె విజయలక్ష్మి, తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తే 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.వార్డులోని ప్రతి గల్లీలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, తాగునీటి ఎద్దడి లేకుండా చూడటం మరియు మహిళల సంక్షేమానికి కృషి చేస్తానని వివరించారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ, వార్డును మున్సిపాలిటీలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. తండ్రికి ఉన్న మంచి పేరు, కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకం తనను గెలిపిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.






