- తాండూరు 33వ వార్డు బీజేపీ అభ్యర్థిగా ఆనంద్ బాగాడే
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టణంలోని 33వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆనంద్ బాగాడే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఆయన తన అనుచరులు మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆనంద్ బాగాడే మాట్లాడుతూ.. 33వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, మంచినీటి ఎద్దడి మరియు అంతర్గత రహదారుల దుస్థితిని చక్కదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలన్న ఉద్దేశంతోనే తాను బీజేపీ తరపున పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆనంద్ బాగాడే అభ్యర్థిత్వంపై వార్డులోని బీజేపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ప్రజలతో మమేకమై ఉండే నాయకుడు కావడంతో, ఈసారి 33వ వార్డులో కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శించి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని ఆయన పేర్కొన్నారు.






