NEWS

మున్సిపల్ బరిలో మహారాజ్ ఫ్యామిలీ…!

మున్సిపల్ పీఠంపై నారాయణ రావు వారసుడి కన్ను

  • తాండూరు మున్సిపల్ పోరులో ‘బీసీ’ అస్త్రం…! 
  • బరిలోకి మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు తనయుడు!
  • మున్సిపల్ చైర్మన్ కాండిడేట్..? 
  • పట్టణం లో మహారాజ్ లా మార్క్….! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే తాండూరు పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడి రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర కలిగిన ‘మహారాజ్’ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవడమే దీనికి కారణం. మాజీ ఎమ్మెల్యే తనయుడు రోహిత్ మహారాజ్ ఈసారి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓటు బ్యాంకే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు తనయుడు రోహిత్ మహారాజ్ రాజకీయ రంగప్రవేశం చేస్తుండటం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చోవాలనే బలమైన నినాదంతో రోహిత్ మహారాజ్ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. నారాయణ రావు కుటుంబానికి తాండూరు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ కుటుంబం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారు ఉండటమే కాకుండా, వీరికి ఢిల్లీ స్థాయి అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

చైర్మన్ పీఠమే లక్ష్యం…?

తాండూరు మున్సిపాలిటీలో బీసీల ప్రాబల్యం ఎక్కువ. “బీసీల రాజ్యాధికారం” అనే నినాదాన్ని వినిపిస్తూ, మున్సిపల్ చైర్మన్ సీటును బీసీలకే దక్కేలా చేయాలనే పట్టుదలతో రోహిత్ ఉన్నారని సమాచారం. తన కుటుంబానికి ఉన్న పట్టుకు బీసీ సామాజిక వర్గ మద్దతు తోడైతే విజయం నల్లేరుపై నడకేనని ఆయన అనుచర వర్గం నమ్ముతోంది. ఇప్పటికే మున్సిపల్ పరిధిలోని ఒక వార్డులో ఆయన ఓటర్ కార్డు మార్చుకునేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే తనయుడి ఎంట్రీతో మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రం మారనుందా….? సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు స్థానిక సమస్యల చుట్టూ సాగుతాయి, కానీ రోహిత్ మహారాజ్ రాకతో ఇది కాస్తా వారసత్వ పోరుగా రూపాంతరం చెందుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఢిల్లీ స్థాయి పరిచయాలు, మరోవైపు స్థానిక బీసీ ఓటు బ్యాంక్.. ఈ రెండింటి కలయికతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నదే మహారాజ్ ఫ్యామిలీ అసలు ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మున్సిపల్ పోరులో ‘రోహిత్ మహారాజ్’ వేయబోయే తదుపరి అడుగులు తాండూరు రాజకీయాల్లో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

You cannot copy content of this page

error: Content is protected !!