HomeNewsఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు

ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు

  • ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు
  • తాండూరు డిపోలో కొనసాగుతున్న పోలింగ్..
  • ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ

తాండూరు, జానవాహిణి ప్రతినిధి :- వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సుమారు పదేళ్ల విరామం తర్వాత ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ కోసం ఎన్నికలు జరుగుతుండటంతో కార్మిక వర్గాల్లో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

తాండూరు డిపోలో ఉదయం 5 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. డిపో పరిధిలో మొత్తం 334 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8:30 గంటల వరకు 97 మంది కార్మికులు ఓటు వేసినట్లు సమాచారం.

ఈ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఐఎన్‌టీయూసీ మద్దతుతో టీడబ్ల్యూయూ తరఫున నవీన్ గౌడ్ బాణం గుర్తుపై, ఏఐటీయూసీ మద్దతుతో ఈయూ తరఫున సుదర్శన్ బస్సు గుర్తుపై, టీజేఎంయూ తరఫున యాదయ్య గద గుర్తుపై పోటీ చేస్తున్నారు.

ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు డిపోకు తరలివస్తుండటంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల నేపథ్యంలో తాండూరు ఆర్టీసీ డిపో వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికుల సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వివిధ యూనియన్ల నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తమకు మెజారిటీ లభిస్తే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయా యూనియన్ల ప్రతినిధులు పేర్కొన్నారు.

పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడే ఫలితాల్లో తాండూరు డిపో కార్మికులు ఏ యూనియన్‌కు పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments