
- తాండూరు మున్సిపల్ పోరు
- రివర్స్ పాలిటిక్స్.. ఆ పార్టీ నేత ఈ పార్టీకి, ఈ పార్టీ నేత ఆ పార్టీకి మద్దతు!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల వేళ స్థానిక రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ జెండాలు వేరైనా, లోపాయకారీ మద్దతు మాత్రం ప్రత్యర్థి పార్టీలకే అన్నట్లుగా ప్రధాన పార్టీల సీనియర్ నాయకుల వ్యూహాలు సాగుతున్నాయి. పట్టణంలోని రాజకీయ సమీకరణాలను గమనిస్తే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య “మద్దతు మార్పిడి” రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక సీనియర్ నాయకుడు గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి వెన్నంటి నిలిచారు. ఇప్పుడు అదే తరహాలో బీఆర్‌ఎస్‌కు చెందిన మరో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెరవెనుక పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధమవ్వగా, అదే స్థాయిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పరస్పర సహకార ఒప్పందం కార్యకర్తలను సైతం అయోమయానికి గురి చేస్తోంది.ఎవరి బలాన్ని ఎవరు తుడిచిపెట్టాలని చూస్తున్నారో అర్థం కాని స్థితిలో తాండూరు రాజకీయం ఉంది. పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఆధిపత్యం, పాత గొడవల నేపథ్యంలోనే ఈ వింత మద్దతులు వెలుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నాయకుల ఈ క్రాస్-సపోర్ట్ నిర్ణయాలు ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసే అవకాశం ఉంది.ఒక పార్టీ నాయకుడు మరో పార్టీకి, ప్రత్యర్థి పార్టీ నాయకుడు ఈ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నాయకుడు వచ్చిన ఎలాంటి వ్యూహాలు రచించిన ప్రజాస్వామ్యం లో ప్రజలే కింగ్ మేకర్ లని, ప్రజాభిప్రాయనికి ఎలాంటి నాయకుడైన లొంగల్సిందే నని పలు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ వింత పోకడల మధ్య తాండూరు మున్సిపాలిటీ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో చూడాలి.



