
- 19వ వార్డులో అక్రమ ఓట్ల నమోదుపై విచారణ చేపట్టాలి
- పక్క రాష్ట్రం వారిని ఓటర్లుగా చేర్చడంపై ఆగ్రహం
- గతంలో 1650.. ఇప్పుడు 2250 ఓట్లు.. ఎలా పెరిగాయి?
- -వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి జంటుపల్లి వెంకటేష్ డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు ఓటర్ల జాబితాలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, వెంటనే వాటిపై విచారణ జరిపి అక్రమ ఓట్లను తొలగించాలని బీజేపీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి జంటుపల్లి వెంకటేష్ డిమాండ్ చేశారు. 19వ వార్డులో గతంలో ఉన్న ఓటర్ల సంఖ్య కంటే ఇప్పుడు అసాధారణంగా పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటకలోని చిత్తాపూర్, చించోలి, సేడం పట్టణాలకు చెందిన వ్యక్తులను నిబంధనలకు విరుద్ధంగా 19వ వార్డు ఓటర్ల జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. గతంలో ఈ వార్డులో 1650 ఓట్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 2250కి చేరడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో ఒక వర్గానికి చెందిన ఓట్లు భారీగా పెరగడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు.పక్క వార్డుల్లో ఉన్న ఓటర్లను కూడా కావాలనే 19వ వార్డు జాబితాలోకి మార్చినట్లు తమ దృష్టికి వచ్చిందని వెంకటేష్ పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టకుండానే ఓట్ల నమోదు ప్రక్రియను పూర్తి చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని, అక్రమంగా చేరిన వారిని గుర్తించి ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.



