
- ఓటర్ల జాబితా సవరణ ‘ప్రహసనం’..
- మున్సిపల్ అధికారుల తీరుపై రాజకీయ పక్షాల ధ్వజం!
- సమీక్షా సమావేశంలో అధికారుల ‘టైమ్ పాస్’ వ్యవహారం
- దొంగ ఓట్లపై నిలదీస్తే నీళ్లు నమలిన యంత్రాంగం
- వార్డుల్లో పెరిగిన ఓట్లు అధికారుల నిర్లక్ష్యానికే నిదర్శనం
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ వ్యవహారం అభాసుపాలవుతోంది. సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అధికారుల అసమర్థతను నిలువునా ఎండగట్టింది. ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకోవాల్సిన మున్సిపల్ యంత్రాంగం, ఓటర్ల జాబితా తయారీని కేవలం ఒక ‘టైమ్ పాస్’ వ్యవహారంగా మార్చేసిందని రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. వార్డుల వారీగా అనూహ్యంగా పెరిగిన ఓటర్ల సంఖ్యపై నేతలు సంధించిన ప్రశ్నలకు అధికారుల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే, కార్యాలయాల్లో కూర్చుని జాబితాలను సిద్ధం చేశారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా వార్డుల్లో దొంగ ఓట్లు ఎలా చేరాయి? అర్హత లేని వారికి ఓటు హక్కు ఎలా వచ్చింది?” అని నేతలు నిలదీయడంతో అధికారులు నోరు మెదపలేక పోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అస్తవ్యస్త పరిస్థితి నెలకొందని సమావేశంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం లో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా రెవెన్యూ అధికారులు చేశారాని, వారికే సంబంధం ఉందని చెప్పడం విడ్డురంగా కనిపించింది. మొక్కుబడి సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకోవడమే తప్ప, పారదర్శకత ఎక్కడ లేదని రాజకీయ పక్షాలు విమర్శించాయి. సమీక్షా సమావేశం మొత్తం గందరగోళంగా సాగిందని, అధికారుల వైఖరి చూస్తుంటే ఎన్నికల నిర్వహణపై వారికి కనీస బాధ్యత లేనట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు.ఎన్నికల ప్రక్రియతో ఆటలాడటం మానుకోవాలని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మొద్దునిద్ర వీడి తప్పులను సరిదిద్దాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. తప్పుడు ఓట్లను తొలగించి, పారదర్శకమైన జాబితాను రూపొందించకుంటే కోర్ట్ ను ఆశ్రయించి ఎన్నికలు నిలిపివేస్తామని హెచ్చరించారు. అధికారుల బాధ్యతారాహిత్యంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.



