
- తాండూరు మున్సిపాలిటీలో అధికారుల ‘జాబితా’ జాప్యం!
- నేడు విడుదల కావాల్సిన ఓటర్ల తుది జాబితా ఏదీ?
- అయోమయంలో అభ్యర్థులు.. ఆందోళనలో ఓటర్లు
- రేపు పోలింగ్ కేంద్రాల ప్రకటన ఉన్నా.. నేటికీ అడుగు పడలేదు!
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ తాండూరు మున్సిపల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం (ఈరోజు) వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల కావాల్సి ఉండగా, అధికారుల అలసత్వం వల్ల అది అడుగు ముందుకు పడలేదు. సాయంత్రం అవుతున్నా జాబితా ఊసే లేకపోవడంతో అభ్యర్థులు, ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల నిబంధనల ప్రకారం, నేడు తుది జాబితా ప్రకటించి, రేపు (మంగళవారం) పోలింగ్ కేంద్రాల వివరాల ముసాయిదాను ప్రచురించాలి. అనంతరం వాటిని వెంటనే ‘టీ-పోల్’ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు మొదటి అడుగైన ఓటర్ల తుది జాబితాయే విడుదల కాకపోవడంతో, రేపటి ప్రక్రియ ఎలా జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.వార్డుల విభజన మరియు ఓటర్ల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ప్రచార పంథాను నిర్ణయించుకోలేకపోతున్నారు. “ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలియకుండా మేము ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి?” అని పలువురు అభ్యర్థులు అధికారులను నిలదీస్తున్నారు. ఎన్నికల వంటి అత్యంత కీలకమైన విషయంలో అధికారుల ఈ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించడం దేనికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.ఓటర్ల జాబితా తయారీలోనే ఇన్ని అడ్డంకులు ఎదురైతే, రానున్న రోజుల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి, తాండూరు మున్సిపల్ అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే జాబితాను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



