Home తెలంగాణ తెలంగాణ సెంటిమెంటుతో పబ్బం ఇంకానా..? | will telangana sentiment work out for brs|...

తెలంగాణ సెంటిమెంటుతో పబ్బం ఇంకానా..? | will telangana sentiment work out for brs| arekapudi| kaushikreddy

0

posted on Sep 13, 2024 3:46PM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా ఆంధ్రోళ్ల పెత్తనం వంటి మాటలు వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి తలెత్తడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా చేస్తున్న దుష్ట పన్నాగాలేనని చెప్పక తప్పదు. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి  రాష్ట్ర సాధన ఉద్యమానికి నేతృత్వం వహించిన టీఆర్ఎస్.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ వాదానికి చెల్లు చీటీ పాడేసి, ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. అది అవసరం, అనివార్యం కూడా.

పైగా ఇక తమది ఫక్తు రాజకీయపార్టీయేననీ, తెలంగాణ సాధనతోనే టీఆర్ఎస్ పని పూర్తయ్యిందనీ స్వయంగా అప్పట్లో ఆ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన సంగతి కూడా తెలిసిదే.  అయితే అధికారం తలకెక్కి అహంకారం అవధులు దాటడంతో  తెలంగాణ కాదు.. దేశం మొత్తం పాలించేయాలన్న అత్యాశతో కేసీఆర్..  తెలంగాణ అన్న పదానికే పార్టీలో స్థానం లేకుండా చేసేశారు. భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చేసి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా జాతీయ రాజకీయాలలోకి దూకేశారు.   ఫలితం దేశ రాజకీయాలలో ప్రభావం చూపడం అటుంచి తెలంగాణలో ఉన్న పునాదులు కూడా కదిలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. ఎన్నికలలో పార్టీ పరాజయానికి కారణమయ్యాయి. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం అన్న విషయాన్ని గుర్తించకుండా, తమ ఓటమి తెలంగాణ ఓటమిగా చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ పార్టీ నాయకులు నేల విడిచి సాము చేస్తున్నారు. తమను ఓడించిన ప్రజలను నిందిస్తున్నారు. దాంతో పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతోంది. సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన తనను జనం కాదంటారా అంటూ కేసీఆర్ ప్రజల ముఖమే చూడటం మానేశారు.  ఓటమి గల కారణాలను విశ్లేషించుకోకుండా, లోపాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేసుకోకుండా మళ్లీ ఆంధ్రా, తెలంగాణ అంటూ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య జరుగుతున్న వివాదం వెనుక బీఆర్ఎస్ కుట్ర విద్వేషాలు రెచ్చగట్టడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక్కడ ఒక్కసారి గతంలోకి వెళ్లాలి. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని వాటిని బలహీనపరిచారు. ఆయా పార్టీల శాసనసభాపక్షాన్ని పార్టీలో విలీనం చేసుకున్నారు. అప్పుడు తప్పుగా కనిపించని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చే సరికి బీఆర్ఎస్ నేతలకు తప్పుగా కనిపిస్తోంది. మహాపరాధంగా కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడాన్ని తెలంగాణ ద్రోహం అన్నట్లుగా చెబుతున్నారు.  ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. బీఆర్ఎస్ వ్యూహాన్ని, కుట్రను చాలా క్లారిటీగా వివరించారు.  తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు.  తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. రేవంత్ రెడ్డి మాటలలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.  

అరెకపూడి గాంధీ పదేళ్ల పాటు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) సభ్యుడిగానే ఉన్నారు. ఆ పార్టీ టికెట్ పైనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా గాంధీ బీఆర్ఎస్ టికెట్ పైనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. లేదూ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటును రాజేయాలని చూస్తోంది. అరెకపూడి గాంధీని ఆంధ్రా వ్యక్తి, ఆయనను గాజులు, చీరలు పంపిస్తాను అంటూ కౌశిక్ రెడ్డి  మాట్లాడారు. అరెకపూడి ఆంధ్రా మూలాలున్న వ్యక్తి అని ఇప్పుడు కౌశిక్ రెడ్డి అంటుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు. అరెకపూడికి చీరలు, గాజులు అంటూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?  గ్రేటర్ హైదరాబాద్  లోని 27 శాసనసభ స్థానాల్లో 18 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందంటే అందుకు ఆంధ్రా సెటిలర్ల మద్దతు, వారి ఓట్లు కారణం కాదా?   గ్రేటర్ పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో ఘోర పరాజయానికి కారణం ఆ పార్టీ అవలంబించిన తెలంగాణ వ్యతిరేక విధానాలే కారణం కాదా?  ఇవన్నీ పక్కన పెడితే  ఇంకా బీఆర్ఎస్ లో ఉన్న ఆంధ్ర  ప్రాంతానికి  చెందిన కొంత మంది ఎమ్మెల్యేల గురించి ఏం చెబుతారు?  

వాస్తవం ఏమిటంటే.. తెలంగాణ సెంటిమెంట్ పనికి వస్తుందని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఇంకా భావిస్తుంటే అది వారి అజ్ణానం తప్ప మరొకటి కాదు.  కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల పట్ల, వారి ఆకాంక్షల పట్ల నిజాయితీతో వ్యవహరించిన దాఖలాలు లేవు. అందుకే తెలంగాణ ప్రజల మద్దతును కోల్పోయింది. కారణాలు ఏవైతేనే బీఆర్ఎస్ కు గత ఎన్నికలలో ఆ మాత్రం స్థానాలు రావడానికి ఇప్పుడు  ఆంధ్రా సెటిలర్ల ఓట్లే కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల తీరు వారినీ బీఆర్ఎస్ కు దూరం చేయడం ఖాయం.  

Exit mobile version