పది రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా బెజవాడ ముంపు బాధితులకు అండగా నిలిచిన చంద్రబాబు.. కనీసం ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఉభయగోదావరి జిల్లాల్లో ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరారు. బుధవారం (సెప్టెంబర్ 11) ఉదయం పదిగంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన చంద్రబాబు ఏలూరు జిల్లా కైకలూరు, కొల్లేరు ప్రాంతాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో కొల్లేరు ప్రాంతంలోని ఉప్పుటేరు వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి రైతులతో ముఖాముఖీ మాట్లాడనున్నారు. బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు చేరింది. కొల్లేటి సరస్సులో నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఉండగా.. దీనికి మించి వరద కొల్లేరులోకి చేరడం, పెద్ద సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. భారీ నష్టం వాటిల్లింది.
చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాలకు ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో కైకలూరు పరిధిలో నష్టపోయిన కొల్లేరు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం కాకినాడ జిల్లా సామర్ల కోట చేరుకుంటారు.
అక్కడ నుంచి రోడ్డు మార్లంలో కిర్లంపూడి మండలంలోని ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారు. ముంపు బాధితులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకుంటారు. అనంతరం సామర్లకోటకు తిరిగి వచ్చి అధికారులతో వరద పరిస్థితి, సహాయ చర్యలపై చర్చించి వారికి దిశా నిర్దేశం చేస్తారు. సాయంత్రం బయలుదేరి వెలగపూడి చేరుకుంటారు.