ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ గడిచిన నెల రోజులుగా పూర్తి స్థాయి నీటిమ్టటంతో జల కళతో కళకళలాడుతోంది. ఎగువ నుంచి అనూహ్యమైన ఇన్ ఫ్లో ఉండడంతో ప్రాజెక్టు గేట్లు దాదాపుగా పూర్తిగా ఎత్తే ఉంటున్నాయి. శనివారం నాడు కూడా ప్రాజెక్టుకు ఉన్న 26 ప్రధాన గేట్లలో 24 గేట్లను ఎత్తి కృష్ణాజలాలను కిందకు వదులుతున్నారు. 590 అడుగులు పూర్తిస్థాయి నీటిమట్టం ఉండే సాగర్ జలాశయంలో ఇప్పుడు 589.90 అడుగుల నీరుంది. ఎగువ నుంచి 2,63,431 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 311.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదే సమయంలో 42 టీఎంసీల వద్ద ఉన్న పులిచింతలకు సాగర్ నుంచి వరద ఎక్కువగా వెళుతోంది. 173.8 అడుగుల నీటిమట్టం ఉండే పులిచింతల పూర్తిగా నిండిపోయి ఉంది. 2,52,920 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 2,55,698 క్యూసెక్కుల నీటిని దిగువన ప్రకాశం బ్యారేజ్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్ లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నీటితో నిండి కళకళలాడుతున్నాయి. రెండు పంటలకు సాగునీటికి ఇక ఢోకా లేదన్న ఆనందంలో రైతాంగం ఉంది.