Home తెలంగాణ బడా బాబులకు హైడ్రా జ్వరం? | hydra fever to bih shots| mallareddy| palla|...

బడా బాబులకు హైడ్రా జ్వరం? | hydra fever to bih shots| mallareddy| palla| encrochments

0

posted on Aug 26, 2024 11:16AM

హైదరాబాద్ లో హైడ్రా దడ పుట్టిస్తోంది. నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో న‌గ‌రంలో టాపిక్‌ ఆఫ్‌ ది న్యూస్‌గా హైడ్రా మారింది. గ‌త ప‌దిహేను రోజులుగా బుల్డోజర్లతో దండయాత్ర చేస్తోంది. ఒక్కోరోజు ఒక్కో ప్లేస్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మ‌రో వైపు హైడ్రా దూకుడుకు రాజ‌కీయ రంగు కూడా పులుముకుంది. బీఆర్ఎస్ నేత‌ల క‌ట్ట‌డాల‌ను టార్గెట్ గా చేసుకొని హైడ్రా కూల్చివేత‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ నేత‌లు చెరువుల‌ను ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌ట్టినా వాటి జోలికి హైడ్రా వెళ్ల‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ నేత‌లు సైతం దీటుగా స‌మాధానం ఇస్తున్నారు. అక్ర‌మ నిర్మాణాలు అని తేలితే మా భ‌వ‌నాల‌పైనా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు ఎవ‌రి వాద‌న‌లు వారు వినిపిస్తున్నారు. హైడ్రా దూకుడు స‌రైందేన‌ని ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు పేర్కొన‌గా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోలా స్పందించారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేతలు ఎలా చేస్తారు? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయం ఇలా అన్నీ.. అక్రమ నిర్మాణాలకు కల్పించింది ప్రభుత్వమే కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.   హీరో నాగార్జున సైతం హైడ్రాకు బాధితుడిగా మార‌డంతో.. చెరువు భూముల‌ను ఆక్ర‌మించి క‌ట్ట‌డాలు చేప‌ట్టిన వారి వెన్నుల్లో హైడ్రా వ‌ణుకు పుట్టిస్తోంది.

 మాదాపూర్ ప‌రిధిలో హీరో నాగార్జునకు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ఉంది.  పదేళ్ల క్రితం దీని  నిర్మాణం చేప‌ట్టారు. తుమ్మిడి చెరువును ఆక్ర‌మించి ఈ నిర్మాణం చేప‌ట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాదాపు మూడున్న‌ర ఎక‌రాలు క‌బ్జా చేసి ఎన్‌ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను నిర్మించార‌ని అధికారుల‌కు గ‌తంలో ఫిర్యాదులు అందాయి. తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ‌యాంలో జీహెచ్ఎంసీ కమిషన‌ర్‌గా సోమేశ్ కుమార్ ఉన్న‌ప్పుడు ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. నిర్మాణాన్ని కూల్చివేయ‌డానికి వెళ్లిన బుల్డోజర్లు దాన్ని టచ్‌ చేయకుండానే వెన‌క్కి వ‌చ్చేశాయి. అప్పటి నుంచి ఈ భవనం జోలికి ఎవరూ వెళ్లలేదు. ఈ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువును పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తాజాగా హైడ్రా రంగంలోకి దిగింది. దీనికితోడు గ‌త వారంరోజుల క్రితం మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిసైతం ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో రంగ‌నాథ్ సార‌థ్యంలోని హైడ్రా బృందం క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌కు సంబంధించిన స‌మాచారం తెప్పించుకొని విచార‌ణ చేసింది. వారి విచార‌ణ‌లో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ చెరువును క‌బ్జా చేసి నిర్మాణం చేశార‌ని తేలింది. దీంతో శ‌నివారం (ఆగస్టు 25) తెల్ల‌వారు జామున రంగంలోకి దిగిన హైడ్రా గంట‌ల వ్య‌వ‌ధిలోనే క‌నెన్ష‌న్ సెంట‌ర్ ను నేల‌మ‌ట్టం చేసింది. అక‌స్మాత్తు ప‌రిణామంతో కంగుతిన్న హీరో అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్ర‌యించాడు. దీంతో కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే కూల్చివేత ప్రక్రియను హైడ్రా బృందం పూర్తిచేసింది.

 హీరో అక్కినేని నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను హైడ్రా నేల‌మ‌ట్టం చేయ‌డంతో న‌గ‌రంలోని చెరువుల‌ను క‌బ్జాచేసి అక్ర‌మ క‌ట్ట‌డాలు చేప‌ట్టిన వారిలో వ‌ణుకు మొద‌లైంది. హైడ్రా దూకుడుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తున్న‌ప్ప‌టికీ.. ప‌లు వ‌ర్గాల‌ వారు హైడ్రా తీరును త‌ప్పుబ‌డుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చివేత‌లు చేప‌డుతున్నార‌ని, కేవ‌లం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న‌వారి క‌ట్ట‌డాల‌నే హైడ్రా కూల్చేస్తున్నద‌ని విమ‌ర్శిస్తున్నారు. అయితే, హైడ్రా బృందం విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోవ‌టం లేదు. కూల్చివేతలలో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉండటంతో బీఆర్ఎస్ విమర్శలను జనం కూడా పట్టించుకోవడం లేదుప. హైద‌రాబాద్ లో అక్ర‌మ నిర్మాణాల‌ను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం, విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌గ‌రానికి అండ‌గా ఉండ‌టం హైడ్రా ప్ర‌ధాన ల‌క్ష్యాలు. ఆ మేర‌కు  ముందుకెళ్తామ‌ని హైడ్రా బృందం చెబుతున్నది. ప్ర‌స్తుతం అక్కినేని నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ సహా పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.  హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏమిటి.. ఎవ‌రి ఆక్ర‌మ‌ణ‌ల‌పై కొర‌డా ఝుళిపించ‌బోతుంద‌నే చ‌ర్చ న‌గ‌ర వాసుల్లోనూ, రాజ‌కీయ పార్టీల నేత‌ల్లోనూ ఆస‌క్తిని రేపుతోంది. అయితే, అంద‌రి దృష్టి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే  మ‌ల్లారెడ్డి కాలేజీల‌పై ప‌డింది.

 గ‌తంలోనే మ‌ల్లారెడ్డి కాలేజీల‌ను చెరువుల‌ను ఆక్ర‌మించి క‌ట్టార‌ని ప‌లువురు ఫిర్యాదులు చేశారు. మ‌రోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే  ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డికి చెందిన గాయ‌త్రి ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మేడ్చ‌ల్ జిల్లా ఘ‌ట్ కేస‌ర్ మండ‌లం వెంక‌టాపూర్ లోని అనురాగ్ విశ్వ‌విద్యాల‌యం భ‌వ‌నాల‌ను వెంక‌టాపూర్ చెరువులో నిర్మించార‌ని అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.  ముందు ముందు ఇంకెంత మంది ఆక్రమణదారుల పేర్లు వెలుగుతోకి వస్తాయా అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. 

Exit mobile version