posted on Aug 23, 2024 4:10PM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రజారంజక పాలనతో జనానికి దగ్గరౌ తోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ చెమటోడ్చి కష్టపడుతోంది. ఇటు వంటి పరిస్థితుల్లో జగన్ నేతృత్తంలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలోనే పార్టీనీ, తన పట్టును కాపాడుకునేందుకు జగన్ ఓ వ్యూహకర్తను నియమించుకోవాలని యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి అప్పడు పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్టుగా పని చేసిన ప్రశాంత్ కిషోరే కర్త, కర్మ, క్రియా అని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ కోసం పని చేసే అవకాశాలు లేవు. పైపెచ్చు ప్రశాంత్ కిశోర్ సొంతంగా రాజకీయపార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకు పరిమితమైపోయారు. ఇంకెంత మాత్రం ఎన్నికల వ్యూహకర్తగా వేరే పార్టీలకు పని చేసేది లేదని విస్పష్టంగా ప్రకటించేశారు. దీంతో జగన్ వైసీపీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమిం చుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సునీల్ కనుగోలు సామాన్యమైన వ్యక్తి కాదు. కర్నాటక, తెలంగాణ అసెంబ్లీలకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక ఉన్నది ఆయన వ్యూహాలే. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం ఆయన చేసిన కృషి ఎన్నదగ్గది. అభ్యర్థుల ప్రకటన నుంచి విజయం వరకూ కాంగ్రెస్ ను నడిపించింది సునీల్ కనుగోల్ వ్యూహాలే. ఏది ఎలా చేయాలో.. ఏ లెక్కన చేయాలో.. ఎలా చెప్తే ప్రజలు వింటారో వెనకుండి నడిపించింది ఆయనే. నిజానికి ఈ ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి.. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సునీల్ పేరు తెలిసింది. ఇక తెలంగాణలో ఎన్నికల ఫలితాల తరువాత తెలుగు రాష్ట్రాలలో సునీల్ కనుగోలు పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది. అటు వంటి సునీల్ కనుగోలును వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తెలు స్తోంది.
సొంతంగా పార్టీని గాడిలో పెట్టడం అసంభవమని భావిస్తున్న జగన్ సునీల్ కనుగోలు సహాయం తీసు కోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలు స్తోంది. అయితే సునీల్ కనుగోలు వ్యూహాలు పీకే వ్యూహాలకు పూర్తి భిన్నమైనవి. విధ్వంసం, కుట్రలు పీకే స్టైల్ అయితే వాస్తవాల ఆవిష్కరణ సునీల్ కనుగోలు స్టైల్. కర్నాటక, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను గమనిస్తే ఆ విషయం ఇట్టే అవగతమౌతుంది.
ఏపీలో 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిశోర్ వైసీపీతో చేయించిన డ్రామాలు, దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించడం, జగన్ తో పాదయాత్రలో చేయించిన ఫీట్లు, వివేకానందరెడ్డి హత్యను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం, తండ్రి, బాబాయ్ మరణాలపై జగన్ తో చేయించిన యాక్టింగ్ ఇవన్నీ తెలుగు ప్రజలు అంత సులభంగా మర్చిపోయేవి కాదు. అందుకే పీకే అంత ఫేమస్ అయ్యారు. జగన్ ఆ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే అటువంటి ఫీట్లకు, కుట్రలు, కుతంత్రాల వ్యూహాలకు సునీల్ కనుగోలు విరుద్ధం. తెలంగాణ అసెంబ్లీకి గత ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పని చేసిన సునీల్ కనుగోలు ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నేతలను గెలుపుకోసం అడ్డదారులు తొక్కించలేదు. రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలిం చలేదు. మతం మత్తులో ముంచలేదు. తెలంగాణ సెంటిమెంటుకు ఆస్కారం ఉన్నా దాని జోలికి వెళ్ళలేదు. మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి క్యాష్ చేసుకొనే ఛాన్స్ ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు. ఏపీలో పీకే లాగా కోడికత్తుల్ని దించలేదు.. గొడ్డలితో గుండెపోట్లు రప్పించలేదు. చేసిందల్లా ఒక్కటే.. నిజాన్ని ప్రజ లకు అర్ధమయ్యేలా ఆవిష్కరించారు. అటువంటి సునీల్ కనుగోలు జగన్ పార్టీ కోసం పని చేస్తారా అంటే కచ్చితంగా చేయరు అనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.