Home తెలంగాణ పతనం అంచున కడప వైసీపీ.. అవినాష్‌తో జగన్‌కి చెడిందా? | ycp loosing grip on...

పతనం అంచున కడప వైసీపీ.. అవినాష్‌తో జగన్‌కి చెడిందా? | ycp loosing grip on kadapa| avinash| jagan| gap| tdp

0

posted on Aug 22, 2024 6:01PM

అవినాష్ రెడ్డి దూరం జరిగారా? జగన్ దూరం పెట్టారా?.. కడపలో ఏం జరుగుతోంది? ఇటీవలి ఎన్నికలలో  చరిత్ర ఎరుగని అపజయాన్ని  సొంతం చేసుకున్న వైసీపీ.. ఇప్పుడు కడప జెడ్పీని కూడా కోల్పోబోతోందా?  ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ తన అరాచక, అస్తవ్యస్థ పాలనతో ప్రజావ్యతిరేకత, ఆగ్రహాన్నీ మూటగట్టుకోవడమే ఘోర పరాజయానికి కారణం. జగన్ పై, వైసీపీపై ప్రజాగ్రహం ప్రాతాలకు అతీతంగా వ్యక్తం అయ్యింది. వైసీపీకి కంచుకోటలాంటి రాయలసీమలో కూడా ఆ పార్టీ పునాదులు కదిలిపోయాయి. చివరికి సొంత జిల్లా కడపలోనూ వైసీపీకి దిమ్మతిరిగే ఫలితాలే వచ్చాయి. 

జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ ఇప్పుడు ఎదురీదుతోంది.  ఇటీవలి ఎన్నికలలో కడపలో సత్తా చాటిన తెలుగుదేశం ఇప్పుడు  జడ్పీ పీఠంపై కన్నేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలలో వైసీపీ ఖాళీ అయిపోయింది. చివరికి కడప జెడ్పీ కూడా చేజారిపోతే ఆబోరు దక్కదని భావించిన జగన్   కడప జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు.  కడపలో పార్టీ బలోపేతానికి అంటూ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి  కడప జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.  

జగన్ నిర్ణయం పార్టీ వర్గాలను విస్మయపరిచింది. ఇప్పటి వరకూ కపడ జిల్లాకు సంబంధించినంత వరకూ పార్టీ వ్యవహారాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డేవరకు కడప వ్యవహారాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకునేవారు. అయితే ఇటీవలి ఎన్నికలలో పార్టీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత నుంచీ అవినాష్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. ఇదే విషయంగా కడప జిల్లా వైసీపీ వర్గాలు ఒకింత ఆగ్రహంతో కూడా ఉన్నాయి. అయినా పార్టీ అధికారం కోల్పోవడంతో అవినాష్ రెడ్డి కేసుల భయంతో వణికిపోతూ పార్టీ కార్యక్రమాలకే కాదు, కడప జిల్లాకే దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తిగా ఇరుక్కున్న ఆయన అరెస్టు తప్పదన్న ఆందఓళనలో  రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి ధైర్యం చెప్పి పోలిటికల్ గా యాక్టివ్ చేయాల్సిన జగన్ అందుకు భిన్నంగా అవినాష్ ను పక్కన పెట్టి సొంత మేనమాకకు కడప జిల్లా పగ్గాలు అప్పగించడం ఇప్పుడు రాజకీయవర్గాలలో  చర్చనీయాంశంగా మారింది. 

జగన్ కు అవినాష్ రెడ్డి దూరం జరిగారా? లేక అవినాష్ ను ఇంకా వెనకేసుకు వస్తే బాబాయ్ హత్య కేసు తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో జగన్ కూడా అవినాష్ ను దూరం పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే జిల్లాలో షర్మిల హవాను తగ్గించడంలో భాగంగా వ్యూహాత్మకంగా జగన్ రవీంద్రనాథ్ రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తల్లి విజయమ్మ సహా పలువురు వైఎస్ కుటుంబీకులు షర్మిలకు బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలో మేనమామకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా షర్మిలకు మద్దతుగా విజయమ్మ బహిరంగ ప్రకటనలకు దూరంగా ఉంటారన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద కడప జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయనడానికి పార్టీ జిల్లా పగ్గాలు రవీంద్రనాథ్ కు అప్పగించడమే నిదర్శనమని చెబుతున్నారు. 

Exit mobile version