posted on Jun 11, 2024 5:38AM
సీఎంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో నందమూరి కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందా అనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారా అనే అంశంపైనా ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఏపీలో కూటమి ఘన విజయం తరువాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన బాలకృష్ణ బాబాయి, నారా లోకేశ్, భరత్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్వీట్ కు చంద్రబాబు, నారా లోకేశ్ రిప్లై ఇచ్చారు. అయితే, ఎన్టీఆర్ ట్వీట్ పై తెలుగుదేశంలోని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసినప్పుడు, లోకేష్ పై అక్రమ కేసులు బనాయించినప్పుడు స్పందించని జూనియర్ ఎన్టీఆర్.. కూటమి విజయం తరువాత స్పందించడంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశంలోని ఓ వర్గం, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది.
గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకీ, నందమూరి, నారా ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీకి చెందిన నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నాని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలుగుదేశం శ్రేణుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వంశీ, నానిల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి దగ్గరి వ్యక్తిగా పేరున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వంశీ, నానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మాత్రమే ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అనుచరులుగా పేరున్న వంశీ, కొడాలి నానిలకు ఎన్టీఆర్ ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడంతోపాటు, కనీసం వారి పేరు కూడా ఎత్తకపోవటం తెలుగుదేశం శ్రేణులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో తెలుగుదేశంలోని ఓ వర్గం ఎన్టీఆర్ తీరును సోషల్ మీడియాలో తప్పుబడుతూ వస్తున్నది.
నందమూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కీలక విషయాన్ని బయటపెట్టారు. ఫ్యామిలీ అంటే సంతోషాన్ని పంచుకోవడం కాదు.. బాధను కూడా పంచుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే.. ఈమధ్య ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం లేదు. నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి రావడం మానేశారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. పిలిచినా రావడం లేదు కాబట్టి పిలుస్తారో లేదో తెలియదని నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం తరపున ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినా ఆయన వచ్చే అవకాశాలు లేవన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అలాంటి సమయంలో స్పందించని ఎన్టీఆర్.. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువని విశ్లేషకులు పేర్కొంటున్నారు.