Kishan Reddy : తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం హర్షదాయకమని, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రిగా, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించడం హర్షదాయకమన్నారు. ఒకట్రెండు రోజుల్లో అధికారులతో చర్చించిన తర్వాత.. ‘మిషన్ 100 డేస్ అజెండా’తో ముందుకెళ్తామన్నారు. దేశాభివృద్ధిల్లో బొగ్గు పాత్ర కీలకమని, బొగ్గు వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాననే విశ్వాసం తనకుందన్నారు. ప్రైవేటు రంగంలో చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయని, వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. విద్యుదుత్పత్తి, స్టీల్ కంపెనీలకు బొగ్గు అవసరం ఉంటుందన్నారు.