posted on Jun 10, 2024 1:17PM
తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్‌ఐ నాయకుడు బొద్దులూరి యశస్వి ఉన్నత విద్యావంతుడు. తెనాలిలో జన్మించిన యశస్వి.. తెలంగాణలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఆయన కృషితో హైదరాబాద్ కు తరలివచ్చిన వేలాది ఐటీ కంపెనీలు యువతకు అపార ఉద్యోగావకాశాలు కల్పించడం తెలిసిందే. ఆ సమయంలోనే యశస్వి కూడా ఉద్యోగస్తుడయ్యారు. అలా ఐటీ ప్రొఫెషనల్ గా కెరీర్ ప్రారంభించిన యశస్వి 21 దేశాలు తిరిగి చివరికి అమెరికాలో స్థిరపడ్డారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా ఉండే యశస్వి 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబుకు, తెలుగుదేశం కు మద్దతుగా స్వరాష్ట్రానికి వచ్చి బ్రింగ్ బ్యాక్ బాబు, జాబు కావాలంటే బాబు రావాలి క్యాంపెయిన్ లో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో కుటుంబాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఆరు నెలల పాటు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అందులో భాగంగా దాదాపు 116 నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాతే తిరిగి అమెరికా వెళ్లారు.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మాటలను విశ్వసించి తూచా తప్పకుండా ఆచరించే యశస్వి తన సంపాదనలో కొంత భాగం పేదల కోసం వ్యయం చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పలువురు పిల్లల విద్య బాధ్యతను తీసుకుని వారిని చదివిస్తున్నారు. అమెరికాలో ఉన్నా ఆయనకు సొంత రాష్ట్రంపై ప్రేమ ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తుల్లో యశస్వి ముందు వరుసలో ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత తొలి ఐదేళ్లు చంద్రబాబు హయాంలో ఏపీ అన్నిరంగాల్లో దూసుకెళ్లేందుకు ముందడుగు వేసింది. కానీ, 2019లో జగన్ సీఎం అయిన తరువాత ఏపీ పతనం ప్రారంభమైంది. జగన్ కక్షపూరిత రాజకీయాలతో అరాచక పాలనను సాగించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, చంద్రబాబు హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను తరిమేయడంతో యువతకు కనీసం ఉపాధి అవకాశలుకూడా లేకుండా చేశారు. దీంతో ఏపీ ప్రజలు ఉపాధికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన యశస్వి అమెరికాలో ఉంటూనే ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. ఎప్పటికప్పుడు జగన్ పాలనా విధానాలను సోషల్ మీడియాలో ఎండగడుతూ వచ్చారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై మొట్టమొదట గళమెత్తినది యశస్వే. జగన్ వేధింపులు, వైసీపీ మూకల అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలపై తెలుగుదేశం పోరు మొదలు పెట్టడానికి ముందే అమెరికాలో ఉంటూనే ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు యశస్వి ప్రయత్నించారు. ఎప్పటికప్పుడు జగన్ పాలనా విధానాలను సోషల్ మీడియాలో ఎండగడుతూ వచ్చారు.
ఈ క్రమంలో.. ప్రశ్నించిన వారిని చిత్రహింసలుపెట్టే జగన్ మోహన్ రెడ్డి దృష్టి యశస్వి వైపు మళ్లింది.. దీంతో ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఏపీలోని ఆయన ఇంటిపై దాడులు చేసింది. చేయించింది. ఇంటిని ధ్వంసం చేసింది. దీంతో యశస్వీ తన తల్లిదండ్రులను హైదరాబాద్ కు మకాం మార్పించారు. జగన్ ప్రభుత్వం యశస్వీపై పగపట్టినట్లు వ్యవహరించింది. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక నేరగాళ్లు, ఉగ్రవాదాలను వెంటాడినట్లు వెంటాడింది. వేటాడింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నించినందుకు జగన్ ప్రభుత్వం యశస్వీకి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిందంటే ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించిందో, ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు ఎంతకు తెగించిందో అర్దం చేసుకోవచ్చు. చివరికి.. ఏపీలో ఉంటున్న తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవటంతో చూసేందుకు వచ్చిన యశస్విని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అర్దరాత్రి అదుపులోకి తీసుకొచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. నాలుగు గంటల తరువాత 41ఏ నోటీసు ఇచ్చి వదిలి పెట్టారు.
అయితే అలా వదిలిపెట్టడానికి జగన్ సర్కార్ ఉదారత ఏమీ కారణం కాదు. యశస్విని అదుపులోనికి తీసుకోవడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా, దేశ విదేశాల్లో వెల్లువెత్తిన నిరసనలే కారణం. సామాజిక మాధ్యమంలో జగన్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ నెటిజనులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే యశస్విని అనివార్యంగా, గత్యంతరం లేక జగన్ సర్కార్ వదిలింది. లేకుంటే రఘురామకృష్ణం రాజును చిత్రహింసలు పెట్టినట్లే యశస్విని కూడా ట్రీట్ చేసి ఉండేది. ఇక యశస్విపై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసును హైకోర్టు రద్దు చేసింది.
ఇక యశస్వి జగన్ సర్కార్ వేధింపులు, బెదరింపులు, అక్రమ అరెస్టులకు ఇసుమంతైనా బెదరలేదు. ఆ తరువాత కూడా యశస్వి ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారిలో చైతన్యం నింపుతూ వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఘోర ఓటమిని చవి చూడబోతున్నారని యశస్వి ఎన్నికలకు ఐదు నెలల ముందునుంచే చెబుతూ వచ్చారు. యశస్వి చెప్పినట్లుగా వైసీపీ ఘోర పరాభవం పాలైంది.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయాలని, అలా జరుగుతుందని మొదటి నుంచి యశస్వి నమ్మకంగా ఉన్నారు. అదే చెబుతూ వచ్చారు. తెలుగుదేశం ఒంటరిగా బరిలోకి దిగితే 110 నుంచి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందనీ.. కానీ, వైసీపీని ఏపీలో పూర్తిగా పాతాళానికి తొక్కేయాలంటే తెలుగుదేశం, జనసేన కలవాలని, దీనికి బీజేపీ కూడా తోడైతే వైసీపీకి 10 నుంచి 14 స్థానాలకంటే ఎక్కువ రావని ఎన్నికలకు ఐదారు నెలల ముందే యశస్వి అంచనా వేశారు.ఆయన అంచనాకు తగ్గట్టుగానే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అయితే, యశస్వి ఓ ఇంటర్వ్యూలో మరో విషయాన్నికూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల తరువాత వైసీపీ కనుమరుగవుతుందని, వైసీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని అన్నారు. వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లే కనిపిస్తోంది.
మొత్తానికి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఎదురొడ్డి పోరాడిన వారిలో టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు యశస్వి ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ పట్ల యశస్వి బొద్దులూరి అంకిత భావం, పార్టీ కోసం ఆయన చేసిన కృషి, పడిన శ్రమను పార్టీ అధిష్ఠానం పలు సందర్భాలలో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించింది. చంద్రబాబు సంస్కరణలు, దార్శనికత కారణంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన యశస్విలాంటి యువత పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముందుకు వచ్చి పని చేయడం ముదావహం.