Home తెలంగాణ ఎవరిదీ ‘ఓపెన్ టాక్ సర్వే’? | open talk survey

ఎవరిదీ ‘ఓపెన్ టాక్ సర్వే’? | open talk survey

0

posted on Jun 10, 2024 10:40AM

ఇప్పుడొకసారి ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ గురించి ఒక టాపిక్ ప్రస్తావనకు తెస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి… జగన్ పార్టీ ఓడిపోయింది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 12న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కూడా చేయబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ పోల్ సర్వే గురించి ప్రస్తావన అవసరమా అనే సందేహం రావచ్చు.. కానీ ఇప్పుడైనా ఈ ప్రస్తావన తీసుకురాకపోతే, నిజమైన ప్రతిభకు గౌరవం దక్కనట్టే అవుతుంది. 

జూన్ 1న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మొత్తం 40 ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడితే, వాటిలో 35 సర్వేలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతోందని చెబితే, 5 సర్వేలు వైసీపీ అధికారంలోకి రాబోతోందని చెప్పాయి. కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన కేకే సర్వే, వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ సర్వే గురించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో చర్చ జరిగింది. ఎందుకంటే, ఆరా సర్వే జగన్ పార్టీకి చెందిన ప్రముఖ చానల్లో ముఖాముఖి రూపంలో ప్రసారమైతే, కేకే సర్వే ఇంకో ప్రముఖ ఛానల్లో ప్రెజెంటేషన్ రూపంలో ప్రసారమైంది. అందుకే, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేకే సర్వేని ఆకాశానికి ఎత్తేస్తే, ఆరా మస్తాన్ సర్వే మీద సెటైర్లు వేస్తూ ఛానళ్ళలో, సోషల్ మీడియాలో వేలాది కథనాలు వెలువడ్డాయి. ఈ హడావిడిలో ఒక సర్వేని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఈ సర్వే కూటమి 164 స్థానాల్లో గెలుస్తుందని, వైసీపీ 11 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని చెప్పింది. ఆ సర్వే పేరు ‘ఓపెన్ టాక్ సర్వే’.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూటమి వస్తుందని చెప్పిన సర్వేల సంస్థలు ‘మేం ముందే చెప్పాం’ అని జబ్బలు చరుచుకుంటే, వైసీపీ వస్తుందని సర్వేలు ఇచ్చిన సంస్థలు ‘ఎక్కడో ఏదో తేడా జరిగింది’ అని సమర్థించుకున్నాయి. అయితే, నూటికి నూరుశాతం కరెక్ట్ సర్వే ఫలితాలను ఇచ్చిన ‘ఓపెన్ టాక్ సర్వే’ సంస్థ ప్రతినిధులు ఎవరూ బయట కనిపించలేదు. పని చెయ్.. ఫలితాన్ని ఆశించకు అనే కర్మసిద్ధాంతాన్ని నమ్మినట్టున్నారు.. అందుకే, వాళ్ళెవరూ బయట కనిపించలేదు. అయినప్పటికీ ఆ అజ్ఞాత సంస్థకు, ఆ సంస్థ అజ్ఞాత ప్రతినిధులకు అభినందనలు.

Exit mobile version