posted on Jun 9, 2024 6:26PM
కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించిన ప్రముఖ నటుడు సురేశ్ గోపి… మోదీ కేబినెట్లో చోటు దక్కించుకోవడం ద్వారా మరో మైలురాయిని అందుకుంటున్నారు. త్రిస్సూర్ నుంచి 75వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ‘త్రిస్సూర్ బీజేపీ అభ్యర్థికి కేంద్రమంత్రి పదవి… ఇది మోదీ హామీ’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లారు. కేరళలో బీజేపీ గెలవడం ఇదే మొదటిసారి కాగా, గెలవగానే సురేశ్ గోపికి కేంద్రమంత్రి పదవి దక్కింది.
సురేశ్ గోపి మలయాళ నటుడు. 250కి పైగా చిత్రాల్లో నటించారు. 2016 ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిస్సూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టనున్నారు.