సిరిసిల్ల జిల్లా గీతానగర్ కు చెందిన గడ్డం జమున ప్రస్తుతం కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్నారు. జమున కరీంనగర్ ఐబీ చౌరస్తాలోని కనకదుర్గ చిట్ ఫండ్ లో మూడు లక్షల రూపాయల చిట్ లో సభ్యురాలిగా చేరారు. చిట్ కి సంబంధించిన గడువు కాలం ముగియడంతో తనకు రావాల్సిన అమౌంట్ గురించి అడగగా హన్మకొండ జిల్లా గోపాలాపూర్ కి చెందిన కనకదుర్గ చిట్ ఫండ్ ఛైర్మన్ రాగిడి తిరుపతయ్య అలియాస్ తిరుపతి రెడ్డి అతని అనుచరుడైన రాజు రెండు ఖాళీ బ్యాంకు చెక్ లు అందచేశారు. వాటిని బ్యాంక్ ఖాతాలో జమ చేయగా చెక్ లు చెల్లలేదు. బాధితురాలు జమున.. చిట్ ఫండ్ ఛైర్మన్ తిరుపతి రెడ్డిని అడగ్గా డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పడమేగాక మరోసారి అడిగితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేయడంతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదుతో చిట్ ఫండ్ ఛైర్మన్ రాగిడి తిరుపతిరెడ్డి, అతని అనుచరుడు రాజుపై ఐపీసీ సెక్షన్స్ 420, 406,506 రెడ్ విత్ 34 ప్రకారం టూ టౌన్ సీఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు.