Home తెలంగాణ అప్రూవర్‌గా మారతానంటూ ‘బూమ్ బూమ్’ వాసుదేవరెడ్డి రాయబారం! | vasudeva reddy as approver| j...

అప్రూవర్‌గా మారతానంటూ ‘బూమ్ బూమ్’ వాసుదేవరెడ్డి రాయబారం! | vasudeva reddy as approver| j brand liquor| jagan| vasudeva reddy| boom boom beer

0

posted on Jun 9, 2024 7:09PM

అందరూ ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్’ అంటూ వుంటారు గానీ… జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ్ స్కామ్‌కి మించిన లిక్కర్ స్కామ్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆర్థిక పరమైన స్కామ్ ఏమైనా జరిగితే జరిగి వుండవచ్చేమో…. ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఆర్థిక స్కామ్ చేయడంతోపాటు… ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడారు. ఐదేళ్ళపాటు ‘జే బ్రాండ్ మద్యం’ పుణ్యమా అని ప్రజల గొంతుల్లోకి ప్రాణాంతక కెమికల్స్.తో కూడిన విషం లాంటి మద్యం ప్రవహించింది. ‘ప్రభుత్వ పెద్ద’తో సాహా ఈ స్కామ్‌లో వున్న పెద్దలందరి ఇళ్ళలోకి డబ్బు భారీగా ప్రవహించింది. మద్యం తాగిన ప్రజల ఇళ్ళలో చావుడప్పులు మోగితే, మద్యం అమ్మిన పెద్దల ఇళ్ళలో డబ్బు నిల్వలు పెరిగాయి. ఈ ఐదేళ్ళలో మద్యం అమ్మకాల ద్వారా 1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని జగన్ ప్రభుత్వం విక్రయించింది. దీనిలో అందరి వాటాలు పోను… ఒక్క ప్రభుత్వ పెద్దకి వచ్చిన వాటా 5 వేల కోట్లు అని లెక్కలు తేలుస్తున్నాయి. ప్రభుత్వం ఐదేళ్ళలో నిర్వహించింది 1.24 లక్షల కోట్ల మద్యం వ్యాపారమే అయినప్పటికీ, విషం లాంటి ఆ మద్యం తాగడం వల్ల ప్రజలు ఆస్పత్రుల పాలై వైద్యానికి చేసిన ఖర్చు, ప్రజలు పని చేయలేకపోవడం వల్ల జరిగిన ఉత్పాదకత నష్టం మొత్తం కలసి 3 లక్షల కోట్లు దాటింది. అంటే, జరిగిన మద్యం వ్యాపారం విలువ కంటే, రెండింతల నష్టం ప్రజలకు జరిగిందన్నమాట. ‘మద్య నిషేధం’ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, జనం జీవితంలో మద్యాన్ని ఒక విషాదంలా మారేలా చేసింది. 

ఇదంతా ఇలా వుంటే, మద్యం వ్యాపారం మీద వస్తున్న ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. అలా అప్పుగా తెచ్చిన 14 వేల కోట్లు ఎటుపోయాయో, ఏమైపోయాయో ఎవరికీ తెలియదు.

ఇలా అయిన వాళ్ళ కంపెనీల దగ్గర మద్యం కొనుగోళ్ళు, మద్యం నాణ్యతను ఎంతమాత్రం పట్టించుకోకపోవడం, అడ్డమైన ధరలకు మద్యాన్ని విక్రయించడం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్‌ని హామీగా పెట్టి 14 వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకురావడం… వీటన్నిటి వెనుక వున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే ఈసీ ఈ ఘనుడిని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించింది. 

దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి 2008 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. ఈయనకు జగన్ పార్టీ నాయకులతో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి. జగన్ అధికారంలోకి రాగానే, రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేని ఇతగాడిని డిప్యుటేషన్ మీద రప్పించి, ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఈయన జగన్ మీద ప్రేమ కురిపిస్తూ, జగన్ చెప్పినట్టు నడుస్తూ నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ, జగన్ అండ్ గ్యాంగ్‌కి మేలు జరిగేలా వ్యవహరిస్తూ వచ్చారు. స్వామికార్యం చూస్తూ, పనిలోపనిగా స్వకార్యం కూడా చూసుకున్నారు. 

జగన్ ప్రభుత్వం హయాం ముగియగానే ఆంధ్రప్రదేశ్ సీఐడీ దృష్టి వాసుదేవరెడ్డి మీద పడింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో వున్న వాసుదేవరెడ్డికి చెందిన నివాసంలో శుక్రవారం (07-06-2024) నాడు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కళ్ళుతిరిగిపోయే స్థాయిలో వాస్తవాలు బయటకి వచ్చినట్టు తెలుస్తోంది. వాసుదేవరెడ్డితోపాటు ఈ భారీ లిక్కర్ స్కామ్‌తో సంబంధం వున్న వాళ్ళందరి గుట్టూ సీఐడి చేతికి చిక్కినట్టు తెలుస్తోంది.

ఐదేళ్ళపాటు జగన్‌తో అంటకాగి ఆయన ఆడమన్నట్టల్లా ఆడిన పాపం తన పీకకు భారీ స్థాయిలో చుట్టుకుంటున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ‘‘నేను అప్రూవర్‌గా మారిపోతాను. జే బ్రాండ్ వెనుక జరిగిన అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు చెబుతాను. ఈ విషయంలో జగన్‌ నిర్వహించిన పాత్ర గురించి కూడా స్పష్టంగా చెబుతాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’’ అని వాసుదేవరెడ్డి పలువురు తెలుగుదేశం నాయకుల దగ్గరకి తనకు సన్నిహితులైన కొంతమంది ప్రభుత్వ అధికారులతో రాయబారాలు పంపినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ నాయకులెవరూ వాసుదేవరెడ్డిని ఎంటర్‌టైన్ చేయడానికి విముఖత కనబరిచినట్టు తెలుస్తోంది. 

Exit mobile version